- మే 21న రీ-పోలింగ్‌కు ఈసీ ఆదేశం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో శనివారం ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిందన్న కారణంతో, అక్కడ ఉన్న మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అరుదైన ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సందర్భంగా భారీస్థాయిలో ఎన్నికల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కమిషన్, ఆనాటి పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేస్తూ మే 21న కొత్తగా ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్ నిర్వహించే ఆనవాయితీ ఉండగా, ఒక నియోజకవర్గం మొత్తం మళ్లీ ఎన్నికలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన స్థానాల కౌంటింగ్ మే 4న షెడ్యూల్ ప్రకారం జరగనుండగా, ఫాల్తాలో మాత్రం మరో మూడు వారాల పాటు ఉత్కంఠ కొనసాగనుంది. ఇప్పటికే డైమండ్ హార్బర్ , మగ్రాహత్ పశ్చిమ స్థానాల్లోని 15 బూత్‌లలో ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో శనివారమే రీ-పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23 , ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో, ఫాల్తాలో జరిగిన తీవ్రమైన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.