Showing posts with label YS Sharmila. Show all posts
Showing posts with label YS Sharmila. Show all posts

Thursday, 19 June 2025

వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు: వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్


ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఆడియో వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్‌ అయి ఉందని, ఇది నిజమో కాదో సుబ్బారెడ్డి తన కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. సుబ్బారెడ్డి చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్‌లో నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేసీఆర్‌, జగన్‌ల నీచ రాజకీయాలు"

"కేసీఆర్‌, జగన్‌ ఆనాడు నీచ రాజకీయాలు చేశారు. అందులో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నాపై నిఘా పెట్టారు. నేను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి జరిపిన కుట్రనే" అని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

సుబ్బారెడ్డి చేతిలో తన ఆడియో

"సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నా. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్‌ అబద్ధాలు చెప్పించారు" అని షర్మిల వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ విషయం వెలుగులోకి వచ్చిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు.

జగన్‌ తీరుపై విమర్శలు

జగన్‌ తీరును "అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది" అంటూ షర్మిల విమర్శించారు. "ఇంత చేసిన జగన్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు అంటే ఎలా? దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా? ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారణ జరపాలి" అని ఆమె డిమాండ్‌ చేశారు.

Thursday, 1 February 2024

పొంగులేటి వ్యాఖ్యలతో టీడీపీకి లాభమా? నష్టమా?



తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపడం వల్లనే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీ స్థాపించారో నారా చంద్రబాబు నాయుడు దానికి ఎన్నడో తిలోదకాలిచ్చారన్నది ఆయన అభిమానుల వాదన. అందుకే ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆపార్టీలో చేరిన వారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా అభిమాన నాయకుడి ఆశయాల మేరకే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. పొంగులేటి వ్యాఖ్యల వల్ల ఏపీలో టీడీపీ లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతున్నది. 


అలాగే తెలంగాణలో వలె ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున టీడీపీకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వద్ద ఉండదు. దీనిపై స్పందించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదు. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విస్మరించిన అంశాల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేశారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగాని, ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టుగాని అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటు గెలుచుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతున్నది. 


పొంగులేటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ  అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒకవేళ పొంగులేటి వ్యాఖ్యలు నిజమైతే ఏపీలో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని అక్కడ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఈ విషయాన్నే అధికార వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  వ్యాఖ్యల వల్ల టీడీపీకి లబ్ధి జరుగుతుందో లేదో తెలియదు. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Wednesday, 8 March 2023

అధికారపార్టీపై పొంగులేటి పోరాటం ఫలించేనా?



తెలంగాణలో ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు, ప్రచారాలు మొదలుపెట్టాయి. ఖమ్మం జిల్లాలో అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ప్రధాన పార్టీలతో సమంగా మరోమాటలో చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు. కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికారపార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెండా ఏదైనా కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ అజెండా అన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమన్నారు. 


నిజానికి 2014లో, 2018లోనూ ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది ఒక్క సీటే. మొదటిసారి ఎన్నికల్లో కొత్తగూడెం సీటు కాగా, రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలోనే ఆ పార్టీ గెలిచింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు రాజకీయ సమీకరణాల్లో భాగంగా వాళ్లంతా బీఆర్‌ఎస్‌లోకి జంప్‌  అయ్యారు.  టీడీపీ గత ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావులు కూడా బీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. వాళ్ల చేతిలో ఓడిపోయిన అధికారపార్టీ కి చెందిన నేతలు తమను పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినా వారికి పార్టీ నుంచి ఎలాంటి హామీలు దక్కలేదు. దీంతో చాలా కాలం మౌనంగా ఉన్నా పొంగులేటి ఎప్పుడైతే అదికారపార్టీతో ఢీ అంటే డీ అని సవాల్‌ చేశారో వారందరికీ ఒక వేదిక దొరికినట్టైంది. దీంతో పొంగులేటి అంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని అదికారపార్టీ నేతలను ఉద్దేశించి చేసినవే. 


పొంగులేటి బీఆర్‌ఎస్ కు దూరంగా ఉంటూ తన అనుచరులతో కలిసి స్వతంత్రంగానే ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకపోయినా ఎన్నికల అనంతరమో లేక ఎన్నికలు సమీపించే సమయానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన అడుగులు ఏ పార్టీ వైపు అన్నది క్లారిటీ లేదు. కానీ ఆయన కుదిరితే బీజేపీ లేదా వైఎస్‌ షర్మిల వెంట నడుస్తారనే చర్చ ఉన్నది. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అలాగే పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను, కేసీఆర్‌ను సవాల్‌ చేసిన అనంతరం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నట్టు మాదే అధికారం అనే పరిస్థితులేమీ ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే పొంగులేటి ఏ పార్టీ వైపు వెళ్లకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఖమ్మం ఎంపీ సీటు తో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార ప్రభావం ఎంత ఉంటుంది? ఆయన అంటున్నట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్తారా? లేక ఆయన వ్యూహం బెడిసి కొట్టి విపక్ష పార్టీలకే నష్టం కలుగుతుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...