హిమాలయ పర్వత ప్రాంతాల్లో హిమనద సరస్సుల విస్ఫోటన వరదలు (GLOFs) అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా మారుతున్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిందూకుష్-హిమాలయ ప్రాంతంలోని హిమనదాలు వేగంగా కరుగుతున్నాయి. దీంతో హిమనదాల ముందు ఏర్పడే సరస్సుల్లో భారీగా కరిగిన నీరు చేరుతోంది. ఈ సరస్సులను అడ్డుకునే సహజ మట్టి, రాళ్ల కట్టలు బలహీనంగా ఉండటంతో ఆకస్మికంగా తెగిపోతే భారీ వరదలు సంభవిస్తున్నాయి.
నేపాల్-టిబెట్ సరిహద్దు నదీ పరివాహక ప్రాంతంలో చోటుచేసుకున్న తాజా వరదలు ఇలాంటి పర్వత ప్రాంత విపత్తులు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో వెల్లడిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో మంచు, హిమనదం భాగాలు విరిగిపడటం, భారీగా కదలికలు చోటుచేసుకోవడం వల్ల ఒక్కసారిగా నీరు, భారీగా పేరుకుపోయిన మట్టి, రాళ్లు దిగువకు దూసుకొచ్చాయి. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో తీరాలు కోతకు గురై, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. నివాస ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోగా, భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం.
ఇలాంటి ముప్పులను తగ్గించేందుకు ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు కీలకం. ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతల ద్వారా ప్రమాదకర స్థితిలో ఉన్న హిమనద సరస్సులను నిరంతరం పర్యవేక్షించవచ్చు. సరస్సుల్లో నీటి మట్టాన్ని నియంత్రితంగా తగ్గించడం, కృత్రిమ నీటి మార్గాలను ఏర్పాటు చేయడం వంటి ఇంజినీరింగ్ చర్యలతో నీటి ఒత్తిడిని తగ్గించవచ్చు.
అదే సమయంలో ఆటోమేటెడ్ వాతావరణ, జలవిజ్ఞాన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసి.. స్థానిక ప్రజలకు సకాలంలో సమాచారం అందించడం, అత్యవసర తరలింపు ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.