- ఆగస్టు 24లోగా అమలు
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఇడ్లీ-సాంబార్ కూడా మధ్యాహ్న భోజనంగా అందనుంది. సవరించిన పీఎం-పోషణ్ మెనూలో భాగంగా ఈ వంటకాన్ని చేర్చిన ఢిల్లీ ప్రభుత్వం.. ఆగస్టు 24లోగా కొత్త మెనూను అమల్లోకి తీసుకురావాలని విద్యాశాఖను ఆదేశించింది.
సవరించిన మెనూలో ఇప్పటికే ఉన్న కొన్ని వంటకాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ఆహార పదార్థాలను చేర్చారు. రాగి హల్వాకు బదులుగా గోధుమపిండి, చనా మసాలా, కిచిడీకి బదులుగా జొన్నలు, సజ్జలు వంటి ఆహార పదార్థాలను అందించనున్నారు.
ఆరు రోజుల సవరించిన మెనూ ప్రకారం మొదటి రోజు పూరీ, నల్ల శనగ గ్రేవీ, ఉడికించిన కూరగాయలు అందిస్తారు. రెండో రోజు ఇడ్లీ-సాంబార్, మూడో రోజు అన్నం, ఛోలే, ఉడికించిన కూరగాయలు, నాలుగో రోజు పూరీ, ఛోలే, ఉడికించిన కూరగాయలు, ఐదో రోజు అన్నం, పప్పు, ఆరో రోజు అన్నం అందించనున్నారు.
అయితే అన్ని పాఠశాలల్లో ఒకే రోజున ఒకే వంటకాన్ని అందించాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. పదార్థాల లభ్యత, రవాణా, ఇతర నిర్వహణ పరిమితులను బట్టి పాఠశాలలు మెనూలోని వేర్వేరు ఆమోదిత వంటకాలను అందించవచ్చని తెలిపింది. అయితే ఆరు రోజుల మెనూను ప్రతి పాఠశాల తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment