Friday, 21 August 2026

ఝార్ఖండ్‌లో ఉద్యోగ పరీక్షల రగడ

 


  • విద్యార్థులు–పోలీసుల మధ్య ఘర్షణలు
  • పలు నియామకాల రద్దుపై హైకోర్టు స్టే.. 
  • పరీక్షల అక్రమాలపై ఆందోళనలు ఉధృతం

రాంచీ: ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. శుక్రవారం రాంచీతో పాటు మరికొన్ని జిల్లాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో పలు నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఝార్ఖండ్ హైకోర్టు మధ్యంతర స్టే విధించడం నిరసనకారులకు ఊరటనిచ్చింది.

‘జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ రిఫార్మ్స్‌ మంచ్‌’ ఆధ్వర్యంలో విద్యార్థులు రాంచీలోని ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఈ వ్యవహారాలకు సంబంధించిన కేసులను సమర్థంగా ఎదుర్కోవడం లేదంటూ కూడా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్బర్ట్ చౌక్ వద్ద ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసినట్లు అధికారులు తెలిపారు.

అనుమతి లేకుండా జేపీఎస్‌సీ కార్యాలయం వద్దకు విద్యార్థులు చేరుకున్నారని రాంచీ సిటీ డీఎస్పీ కేవీ రామన్ తెలిపారు. నిర్దేశించిన మార్గాన్ని మార్చుకుని విద్యార్థులు ర్యాలీగా వెళ్లడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రూపేశ్ కుమార్ సింగ్ చెప్పారు. సదర్ ఆసుపత్రి సమీపంలోనూ ఆందోళనకారుల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రోగులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారని తెలిపారు.

అయితే పోలీసులు, అధికార జేఎంఎం కార్యకర్తలు తమ శాంతియుత ఆందోళనను అడ్డుకున్నారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా నిరసనకారులపై కూడా దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న కోర్ కమిటీ సభ్యుడు కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ర్యాలీ సమయంలో స్పృహ కోల్పోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారని విద్యార్థి నాయకుడు తెలిపారు.

రాంచీతో పాటు హజారీబాగ్‌, గిరిడీహ్‌ జిల్లాల్లోనూ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోరెన్‌, రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులను జేఎంఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఉద్యోగ పరీక్షల అంశాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని జేఎంఎం ఆరోపించింది.

22 పరీక్షల రద్దుతో మొదలైన వివాదం

ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 25 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18న ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ, ఔట్‌సోర్సింగ్ సంస్థ టీపీఎల్‌ నిర్వహించిన 22 నియామక పరీక్షలను రద్దు చేసింది. మరో 23 పరీక్షలపై దర్యాప్తునకు ఆదేశించింది.ఈ నిర్ణయంతో ఇప్పటికే ఎంపికైన సుమారు 2,700 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల్లో అక్రమాలు జరిగితే అందుకు తాము బాధ్యులు కాదని, మెరిట్ ఆధారంగా ఎంపికైన తమ ఉద్యోగాలను రద్దు చేయడం అన్యాయమని వారు వాదిస్తున్నారు.

నియామకాల రద్దుపై హైకోర్టు స్టే

విద్యార్థుల ఆందోళనల మధ్య హైకోర్టు ఉత్తర్వులు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించాయి. 11వ, 13వ జేపీఎస్‌సీ పరీక్షల ద్వారా జరిగిన నియామకాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం కోర్టు స్టే విధించింది.శుక్రవారం జస్టిస్ దీపక్ రోషన్ నేతృత్వంలోని ధర్మాసనం జేఎస్‌ఎస్‌సీ–సీజీఎల్‌ ద్వారా జరిగిన నియామకాలతో పాటు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకాలను రద్దు చేయడంపైనా మధ్యంతర స్టే విధించింది.

ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారంటూ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాంచీ, హజారీబాగ్‌, గిరిడీహ్‌లలో విద్యార్థులపై జరిగిన చర్యలు దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయ అధికారులు సమర్థంగా వాదించలేదని ‘జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ రిఫార్మ్స్‌ మంచ్‌’ ఆరోపించింది. ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో ఆగస్టు 24 నుంచి ‘రిక్రూట్‌మెంట్ సిస్టమ్ రిఫార్మ్స్ యాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15న హైకోర్టులో ప్రభుత్వం తన వాదనను సమర్థంగా వినిపించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉందని హెచ్చరించారు.

దర్యాప్తును ముమ్మరం చేసిన సీఐడీ

మరోవైపు ఉద్యోగ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తును సీఐడీ మరింత ముమ్మరం చేసింది. అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎవరి వద్ద ఉన్నా తమకు అందించాలని ప్రజలను కోరింది. 2023లో జరిగిన జేఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో అక్రమాల ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 37 మంది అనుమానితులను విచారించింది. ఝార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల రద్దు, ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

No comments:

Post a Comment

Featured post

నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌ హవా

చిరంజీవి కెరీర్‌లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే! టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురా...