- సుష్మిత ఘాటు వ్యాఖ్యలు
వరంగల్: తెలంగాణ రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం కేంద్రంగా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డినే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపేలా చేసిన వ్యాఖ్యలు కొండా దంపతుల రాజకీయ ఆశలకు గండికొట్టినట్లు చర్చ జరుగుతోంది.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె కొండా సుష్మితను పోటీ చేయించాలని కొండా సురేఖ, కొండా మురళి దంపతులు పలుమార్లు ప్రకటించారు. అయితే వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల నుంచే పోటీ చేస్తారని, ఆయనను ఆశీర్వదించాలని కోరారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు కొండా దంపతులకు రాజకీయంగా షాక్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొందరికి కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. తమ కుటుంబం చేసిన సహకారంతోనే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాలలో గెలిచారని ఆమె పేర్కొన్నారు. గతంలో ఆయనకు సహాయం చేసిన తన తండ్రి కొండా మురళి ఇప్పుడు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడటం ఎందుకని సుష్మిత ప్రశ్నించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఇప్పుడే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలవలేరని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో కొండా సురేఖ దంపతుల పరకాల రాజకీయ వ్యూహానికి బ్రేక్ పడినట్లేనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరకాల నుంచి సుష్మితను పోటీకి దింపుతామని కొండా దంపతులు ప్రకటించిన నేపథ్యంలో, రేవూరి ప్రకాశ్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలకు కొండా దంపతులు దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజా పరిణామాలతో పరకాల కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment