- ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
- డ్రగ్స్ వ్యసనం వ్యక్తినే కాదు.. కుటుంబం, సమాజాన్నీ దెబ్బతీస్తుంది
- సామాజిక మార్పు కోసం కంటెంట్ క్రియేటర్లు సృజనాత్మకతను వినియోగించాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: మాదకద్రవ్యాల రహిత యువత, మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రచారం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా ప్రజలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది సమష్టి సంకల్పమని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబం, సమాజాన్ని ప్రభావితం చేస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్న వారిని అభినందించారు. మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం శక్తిమంతమైన నినాదాన్ని రూపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువ సంగీత కళాకారులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని అందించే పాటలను రూపొందించాలని కోరారు.
దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు కొదవ లేదని మోదీ అన్నారు. సమాజానికి ఉపయోగపడేలా వివిధ భారతీయ భాషల్లో కంటెంట్‌ను రూపొందించాలని సూచించారు. సామాజిక మార్పుకు సృజనాత్మకతను ఒక సాధనంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదే సందర్భంగా ‘పీఎం స్వనిధి యోజన’ ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై తగినంత చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లో మహిళల వాటా సుమారు 46 శాతంగా ఉందని వెల్లడించారు.

No comments:
Post a Comment