- సుప్రియా సూలే కుమార్తె వివాహ విందులో అరుదైన దృశ్యం
న్యూఢిల్లీ: సాధారణంగా పార్లమెంట్‌లో పరస్పరం విమర్శలు చేసుకునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ విందుకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, రాహుల్ గాంధీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఢిల్లీలోని 6, జన్‌పథ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ విందులో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీతో రేవతి సూలే వివాహం జూన్‌లో ముంబైలో జరగగా.. ఢిల్లీలోని ఈ కార్యక్రమం ఘనమైన విందుగా నిర్వహించారు.
ముందుగా అమిత్ షా వేదికపైకి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం సుప్రియా సూలే.. రాహుల్ గాంధీతో పాటు సోనియా, ప్రియాంక గాంధీలను వేదికపైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నూతన దంపతుల మధ్య సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు నిలిచిన దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు విస్తృతంగా చిత్రీకరించారు.
ఇటీవల విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యకు సంబంధించి పార్లమెంట్‌లో అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఇద్దరు నేతలు ఒకే కార్యక్రమంలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వివాహ విందులో మాత్రం నేతలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పరస్పరం పలకరించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వేడుకకు హాజరై శరద్ పవార్, ఆయన భార్యతో భేటీ అయ్యారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పరస్పరం కరచాలనం చేసుకుంటూ కనిపించారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, చిరాగ్ పాస్వాన్, గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, ఢిల్లీ మంత్రి ప్రవేశ్ వర్మ తదితరులు కూడా విందుకు హాజరయ్యారు.
కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తదితర ప్రముఖులు కూడా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల నేతలు ఒకే టేబుళ్ల వద్ద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. సోనియా గాంధీ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి పలకరించడం కూడా ప్రత్యేకంగా నిలిచింది.
రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్న సమయంలోనూ ఒకే వివాహ వేదికపై అగ్రనేతలు కలుసుకోవడం.. భారత రాజకీయాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
No comments:
Post a Comment