Friday, 7 August 2026

కావేరీ కోసం ఎన్ని అవమానాలకైనా సిద్ధమే

 


  • తమిళనాడు సీఎం విజయ్‌

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్య పరిష్కారానికి అవసరమైతే ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

మేకెదాటు ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం చేపట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. కావేరీ అంశంపై కర్ణాటక అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐకమత్యాన్ని చాటిందని, అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి నిరాకరిస్తోందని విమర్శించారు. మేకెదాటు అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

దీనిపై సీఎం విజయ్‌ స్పందిస్తూ.. మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించామని తెలిపారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు. 1969లో ఈ ప్రాజెక్టుకు తొలిసారిగా అనుమతి ఇచ్చింది డీఎంకే ప్రభుత్వమేనంటూ ఉదయనిధి విమర్శలకు బదులిచ్చారు.

తన బెంగళూరు పర్యటనను కూడా విజయ్‌ సమర్థించుకున్నారు. శత్రు దేశాలు సైతం తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. పొరుగు రాష్ట్రంతో సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు.

‘‘తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్యను పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా నాకు అవమానం ఎదురైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం’’ అని విజయ్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

అరిజిత్ సింగ్ ఒక ఫకీరు లాంటివాడు

 బాలీవుడ్‌కు దూరంగా సొంత ఊళ్లో ప్రశాంత జీవనం ఆ నిర్ణయంపై నీలేష్ మిస్రా కీలక వ్యాఖ్యలు ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ సినిమాల కోసం ప్లేబ్యాక్...