Wednesday, 19 August 2026

అమెరికా బలగాలకు సాయం చేస్తే యుద్ధంలో భాగస్వామ్యమే

 

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

తెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు సహకరించవద్దని పర్షియన్‌ గల్ఫ్‌ దక్షిణ తీరంలోని దేశాలను ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ అలీ అబ్దొల్లాహీ హెచ్చరించారు. అమెరికా సైనిక బలగాలకు ఎలాంటి సాయం చేసినా, సదుపాయాలు కల్పించినా దాన్ని అమెరికా సైనిక చర్యలో భాగస్వామ్యంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

గల్ఫ్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాల్లో అమెరికా కార్యకలాపాలను ఇరాన్‌ నిశితంగా గమనిస్తోందని అబ్దొల్లాహీ తెలిపారు. ఇరాన్‌పై తమ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని ఇప్పటికే ప్రకటించిన గల్ఫ్‌ దేశాలు.. తమ ప్రాంతంలోని పరిణామాలు తమ దృష్టికి రాకుండా జరుగుతున్నాయని భావించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రాంతీయ స్థావరాల్లో భారీ సంఖ్యలో సైనిక విమానాలు, ఇంధన సరఫరా విమానాలు మోహరించడం ఆతిథ్య దేశాల అనుమతి లేదా కనీసం అవగాహన లేకుండా సాధ్యమయ్యే విషయం కాదని ఆయన పేర్కొన్నారు.



‘‘అమెరికా సైన్యానికి ఎలాంటి సహాయం లేదా సదుపాయం కల్పించినా, అది అమెరికా సైనిక బలగాలతో కలిసి పనిచేయడంగా పరిగణిస్తాం’’ అని అబ్దొల్లాహీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలు తమ భూభాగాలను అమెరికా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇటీవల ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా అబ్దొల్లాహీ నియమితులయ్యారు. ఆగస్టు 10న ఇరాన్‌ సుప్రీం లీడర్‌, సాయుధ దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయతొల్లా మొజ్తబా హొస్సేని ఖమేనీ ఆరుగురు సీనియర్‌ కమాండర్లను కీలక పదవుల్లో నియమించారు. ఇందులో అబ్దొల్లాహీకి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ బాధ్యతలు అప్పగించగా, కియోమర్స్‌ హైదరీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులయ్యారు.

మరోవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని తగ్గించే అంశాన్ని అమెరికా రక్షణ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు నెలల తరబడి ఇరాన్‌ దాడులకు గురికావడంతో వాటిని తిరిగి నిర్మించాలా, లేక ప్రాంతంలో అమెరికా బలగాల సంఖ్యను తగ్గించాలా అనే అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.

దాడుల్లో దెబ్బతిన్న స్థావరాలను గతంలో ఉన్న స్థాయిలోనే పునర్నిర్మించకపోవచ్చన్న సంకేతాలను కూడా అమెరికా రక్షణ శాఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా సెప్టెంబర్‌ చివరి నాటికి అమెరికాకు సుమారు 37.5 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని పెంటగాన్‌ అంచనా వేసినట్లు సమాచారం. అయితే పశ్చిమాసియాలో దెబ్బతిన్న సైనిక స్థావరాలను పునర్నిర్మించేందుకు అయ్యే ఖర్చు ఇందులో లెక్కలోకి రాలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన చర్చల బృందానికి తాత్కాలికంగా వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం. ఇరాన్‌ ఒప్పందానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Featured post

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు

 సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ...