Wednesday, 12 August 2026

యుద్ధనౌక నుంచి సముద్రంలోకి దూకిన అమెరికా నావికులు?


  • తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నాలు



పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అమెరికా యుద్ధ నౌకల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపైనా పడుతున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌ జలాల్లో నెలల తరబడి విధులు నిర్వర్తిస్తున్న అమెరికా నావికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఆహారం, మంచినీటి కొరత, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, సుదీర్ఘకాలం సముద్రంలోనే విధులు నిర్వహించడం వంటి పరిస్థితులు సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.


అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌లో కొందరు నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ‘మిలిటరీ టైమ్స్‌’ కథనం పేర్కొంది. ఈ నౌకలో సుమారు 5 వేల మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. రికార్డు స్థాయిలో సుమారు 250 రోజులుగా నౌక సముద్రంలోనే ఉండటంతో సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లు గతంలోనూ కథనాలు వచ్చాయి.


ఇరాన్‌-అమెరికా మధ్య ఘర్షణ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసినట్లు తెలుస్తోంది. అబ్రహం లింకన్‌ సహా ఇతర యుద్ధ నౌకలతో ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో నావికుల మానసిక పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ కుటుంబాలను తిరిగి ఎప్పుడు కలుసుకుంటామో తెలియని అనిశ్చితి కూడా వారిపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మొత్తం ఆరుగురు నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ కథనాలను అమెరికా నేవీ అధికారులు ఖండించినట్లు తెలుస్తోంది.


ట్రంప్‌ ఉన్నంతకాలం యుద్ధం కొనసాగుతుందా?


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉన్నంతకాలం యుద్ధాన్ని కొనసాగించే వ్యూహాన్ని ఇరాన్‌ అనుసరించే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) సీనియర్‌ సలహాదారు ఒకరు యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించి ప్రత్యర్థిని బలహీనపరిచే వ్యూహాన్ని అనుసరించవచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై భవిష్యత్తులో దాడి చేయాలనుకునే దేశాలు దాని మూల్యం గురించి ఆలోచించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

మోడీ, అమిత్ షా రాజీనామా చేసేవరకు నిద్రపోనివ్వం

బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేసేవరకు వారిని నిద్రపోనివ్వమని, దేశ ప్రజ...