- కాంగ్రెస్ వచ్చాకే విద్యుత్ సమస్యలు మొదలయ్యాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు
- జెన్‌కోలో బొగ్గు నిల్వలు లేవని ఆరోపణ.. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంట్ సమస్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ‘కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన కేటీఆర్, విద్యుత్ సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్లే విద్యుత్ ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని ప్రస్తావిస్తూ.. ‘‘ఎల్‌నినో వల్ల కాదు.. కాంగ్‌నినో వల్లే కరెంట్ కోతలు’’ అని వ్యాఖ్యానించారు. జెన్‌కోలో బొగ్గు నిల్వలు లేవని, సింగరేణిలో పెద్ద మొత్తంలో బొగ్గు మాయమైందని ఆయన ఆరోపించారు. బొగ్గు అందుబాటులో ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్నించారు. నీటి కొరత కారణంగా జల విద్యుత్ ప్లాంట్లపైనా ప్రభావం పడుతోందని పేర్కొంటూ, రాష్ట్ర రైతులకు హామీ ఇచ్చినట్లుగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment