న్యూఢిల్లీ: ఢిల్లీలో డెలివరీ సిబ్బంది దాడిలో 54 ఏళ్ల మణిపూర్‌కు చెందిన సంగీతకారుడు సీ. విక్రమ్‌సింగ్ మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.“వాళ్లు కూడా భారతీయులే. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా భారతీయులే. ఇది రాజకీయాలు చేయాల్సిన విషయం కాదు.. చర్యలు తీసుకోవాల్సిన విషయం” అని రిజిజు అన్నారు. ఆహారం డెలివరీ చేసే సిబ్బంది, ధాబాల్లో పనిచేసే వారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారని తెలిపారు.అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో విక్రమ్‌సింగ్ మృతి చెందారని, మరణం సంభవించడంతో ఈ ఘటన తీవ్ర అంశంగా మారిందని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయినప్పటికీ ఢిల్లీ పోలీసులు వారిని చాలా త్వరగా అరెస్టు చేశారని చెప్పారు.
చార్జిషీట్ దాఖలుపై ఢిల్లీ పోలీసులను అడిగినట్లు రిజిజు తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. కేసులో త్వరితగతిన తీర్పు రావాలని, నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం కీలకమని అన్నారు.రాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో దానిని ముందుగానే అడ్డుకోలేకపోయినా, విక్రమ్‌సింగ్ కుమారుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించారని రిజిజు వివరించారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోరాదనే సందేశం వెళ్లేలా కఠిన శిక్ష ఉండాలని అన్నారు.విక్రమ్‌సింగ్ కుటుంబానికి రిజిజు సానుభూతి తెలిపారు. “విచారణ వేగంగా జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు” అని స్పష్టం చేశారు.
రాహుల్‌గాంధీ ఈ ఘటనలో బీజేపీని ఎందుకు ప్రస్తావిస్తున్నారని రిజిజు ప్రశ్నించారు. ఒక విషాద ఘటనలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినప్పుడు తక్షణ చర్యలపైనే దృష్టి పెట్టాలని సూచించారు.ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన నార్త్‌ఈస్ట్ స్పెషల్ పోలీస్ సెల్ నిరంతరం వారితో సంప్రదింపుల్లో ఉంటుందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని రిజిజు పేర్కొన్నారు. ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
No comments:
Post a Comment