Saturday, 19 September 2026

విద్యార్థుల యూనిఫాంలో కొత్త రంగులు




  • వచ్చే ఏడాది తొలిరోజే అందేలా ప్లాన్‌
  • ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో యూనిఫాంలు.. 
  • అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం రంగులు ఆకట్టుకునేలా ఉండటంతో పాటు డిజైన్లలోనూ వైవిధ్యం తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. రెండో జత యూనిఫాంను ఈ నెలాఖరులోగా అందజేస్తామని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), మోడల్‌ స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందించినట్లు వెల్లడించారు.


విద్యార్థులందరికీ నోటు పుస్తకాల పంపిణీ కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు వంటి అవసరమైన సామగ్రి పంపిణీ కూడా పూర్తయినట్లు వివరించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా మరో 10 శాతం మంది చేరే అవకాశం ఉందని, ఆ మేరకు ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ఈ ఏడాది విద్యార్థులకు అందించిన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తికరమైన స్పందన వచ్చిందని సీఎం పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...