హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతున్న తీరును చూసి ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఉపయోగిస్తున్న దూషణలు, వీధి స్థాయి భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.ఒకే అంశంపై రెండు రోజులపాటు చర్చిస్తూ విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేయడం దురదృష్టకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి రాజకీయ విమర్శలకు సభా సమయాన్ని కేటాయించడం సరికాదన్నారు.
22ఏ భూముల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేల కోట్ల రూపాయల భూ లావాదేవీల్లో మంత్రులు, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని తెలిపారు.దక్షిణ తెలంగాణలో రైతులకు సాగునీరు అందక ఆందోళన చెందుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. డీఏ, పదవీ విరమణ ప్రయోజనాలు, పెండింగ్ బిల్లులు అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తారా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు.దోమలు, వ్యాధులు, పారిశుద్ధ్య లోపాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బయటకు పరస్పరం పోరాడుతున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలు, ఇతర ఆందోళనకారులతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో నిజమైన అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని మార్చగలదని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment