Tuesday, 8 September 2026

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి

  • హరీశ్‌రావుపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలపై మంగళవారం కూడా శాసనసభలో వాగ్యుద్ధం కొనసాగింది. సభ రెండో రోజు ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. సీనియర్‌ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అవమానించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఘటనను రాష్ట్రంలోని మహిళలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు.‘‘కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరవ సభ కాస్తా కౌరవ సభగా మారింది. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్‌ పార్టీకి పడుతుంది’’ అంటూ హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



‘ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి’

హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులంటే తనకు, సభకు ఎంతో గౌరవం ఉందన్నారు.

‘‘మీరు చెబితే నేను వినట్లేదా? ఎందుకంత ఆవేశం? ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’’ అంటూ స్పీకర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల తనకు కూడా గౌరవం ఉందని ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. తనకు ఉన్న ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లతో పాటు వారిని కూడా సోదరీమణులుగానే భావిస్తానని చెప్పారు. మహిళా సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

స్పీకర్‌ను బెదిరించేలా బీఆర్‌ఎస్‌ తీరు: శ్రీధర్‌బాబు

శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్పీకర్‌ను బెదిరించే విధంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

సభలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే స్పీకర్‌ తగిన చర్యలు తీసుకుంటారని, సభను ఎలా నడపాలో స్పీకర్‌కు సూచించే హక్కు ఇతరులకు లేదని అన్నారు. స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో రికార్డులను ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు స్పష్టమవుతాయని శ్రీధర్‌బాబు అన్నారు. మహిళా సభ్యుల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ స్పష్టం చేసినా బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుండా బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మండిపడ్డారు.

No comments:

Post a Comment

Featured post

ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సురక్షితమేనా?

మణిపూర్‌ సంగీతకారుడి హత్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్‌ విక్రమ్‌ సింగ్‌ హత్యపై కాంగ్రెస్...