అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పోషకుడిగా (ప్యాట్రన్) వ్యవహరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని ఆ బాధ్యతల నుంచి ట్రస్ట్ తొలగించింది. విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన భయ్యాజీ జోషి తాను ఆరోగ్య సమస్యల కారణంగానే పదవి నుంచి తప్పుకున్నానని తెలిపారు. తన రాజీనామాకు విరాళాల చోరీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
కొన్నేళ్ల క్రితం రామజన్మభూమి ప్రాజెక్టుకు సంబంధించిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ పారదర్శకతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భయ్యాజీ జోషిని ట్రస్ట్ పోషకుడిగా నియమించారు. బహిరంగ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోయినా, ట్రస్ట్ కీలక నిర్ణయాల రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించినట్లు భావిస్తారు. జోషి 2009 నుంచి 2021 వరకు ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ్ (ప్రధాన కార్యదర్శి)గా బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, విరాళాల చోరీ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకముందే చోరీకి పాల్పడిన నిందితుల వద్ద నుంచి ఆలయ ట్రస్ట్ సుమారు రూ.80 లక్షల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో వెంటనే చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
అదే సమయంలో ఆలయ ట్రస్ట్ పరిపాలనా వ్యవహారాలు, విరాళాల నిర్వహణలో జరిగిన లోపాలు, భద్రతా వ్యవస్థ పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ దర్యాప్తు నివేదిక ఆధారంగా మరిన్ని పరిపాలనా, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దర్యాప్తు పురోగతిపై అందరి దృష్టి నెలకొంది.