- కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన రాజకీయ, సామాజిక వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. తాను ఒకప్పుడు "మితవాద హిందువు" (Moderate Hindu)నని, ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల స్ఫూర్తితో "జాగృత హిందువు" (Awakened Hindu)గా మారాలని కోరుకుంటున్నానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన కంగనా, తన గత జీవితం గురించి విమర్శలు చేసిన వారికి తాను ఎలాంటి సమర్థనలు ఇవ్వబోనని స్పష్టం చేశారు.
"అవును... నేను ఒకప్పుడు మితవాద హిందువునే. ఇప్పుడు నన్ను 'నువ్వు ఎప్పటి నుంచి సంఘీ అయ్యావు?' అని ప్రశ్నిస్తున్నారు. నేను సంఘీ కావాలనుకుంటున్నాను. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించే జాగృత హిందువుగా మారాలనుకుంటున్నాను. ఆ మార్గాన్ని నేను స్వీకరించాలనుకుంటున్నాను" అని కంగనా పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలోని కొందరు హిందూ మహిళలపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. వారితో సన్నిహితంగా మెలిగిన అనుభవంలో, వారు హిందువులే అయినప్పటికీ రాజకీయాలు, మతం విషయంలో స్పష్టమైన సిద్ధాంతం లేకుండా ఉంటారని, యువతలో సాధారణంగా ఇలాంటి తటస్థ ధోరణి కనిపిస్తుందని అన్నారు. అయితే ఇస్లామిస్టు భావజాలం కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరిగిన తర్వాత వారి ఆలోచనలు స్పష్టమైన దిశలో మారి చివరకు వామపక్ష భావజాలాన్ని స్వీకరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని లేదా సిద్ధాంతాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించిందని కంగనా పేర్కొన్నారు. అదే స్వేచ్ఛ హిందూ మహిళలకు కూడా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. "ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని లేదా భావజాలాన్ని స్వీకరించవచ్చు. కానీ హిందూ కుమార్తెల విషయంలో మాత్రం నేను నన్ను సమర్థించుకోను. నేను గతంలో ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడలేదని, వేతన సమానత్వం వంటి అంశాలపై మాట్లాడలేదని ఒప్పుకుంటాను. అవును... నేను ఒకప్పుడు మితవాద హిందువునే" అని ఆమె అన్నారు.
తన గత జీవితంలో పార్టీలు చేసుకునేదాన్నని, ఇతరుల మాదిరిగానే జీవించానని వచ్చిన విమర్శలకూ కంగనా స్పందించారు. "అవును... నేను గతంలో అన్నీ చేశాను. కానీ ఇప్పుడు నేను మారాలనుకుంటున్నాను. స్పష్టమైన సిద్ధాంతం కలిగిన, జాగృత హిందువుగా మారాలని కోరుకుంటున్నాను. ఆ మార్గం నాకు ఎందుకు మూసివేయాలి? ఇలాంటి ద్వంద్వ వైఖరి సరికాదు. హిందూ మహిళలు కూడా క్రమశిక్షణతో కూడిన స్పష్టమైన హిందూ భావజాలాన్ని స్వీకరించే స్వేచ్ఛ కలిగి ఉండాలి" అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.