- రాజీవ్‌తో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
- నవంబర్ 10న విడుదల కానున్న ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో వ్యక్తిగత జ్ఞాపకాలు
దశాబ్దాల క్రితం ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ నగరంలో ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో జరిగిన పరిచయం.. తన జీవిత గమనాన్నే మార్చేసిందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తన తొలి పరిచయం, తొలిచూపులోనే కలిగిన ఆకర్షణ, ఆ తర్వాత స్నేహంగా మొదలై ప్రేమగా మారిన తమ అనుబంధం గురించి ఆమె తాజాగా పంచుకున్నారు. తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లోని ఈ విశేషాలను వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ పుస్తకం 2026 నవంబర్ 10న పాఠకుల ముందుకు రానుంది.
‘రాజీవ్, నేను ప్రేమ, నవ్వులు, మధుర జ్ఞాపకాలతో నిండిన ఓ ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. నవంబర్ 10న ఆ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను’ అని సోనియా గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. తన జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని ఆవిష్కరించే ఈ పుస్తకంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం
1960వ దశకం మధ్యలో కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ రెస్టారెంట్’లో రాజీవ్ గాంధీని తొలిసారి కలిసినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు. భారతదేశం సహా యూరప్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ రెస్టారెంట్‌కు తరచూ వచ్చేవారు. ఓ ఉమ్మడి స్నేహితుడు వారిద్దరినీ పరిచయం చేయడంతో ఆ పరిచయం మొదలైంది. అప్పట్లో ఇంగ్లండ్‌లో తనకు అలవాటైన ఆహారం, ముఖ్యంగా ఇటాలియన్ వంటకాలు దొరికే ప్రదేశాల కోసం వెతికేవారినని సోనియా చెప్పారు. ఆ సమయంలో రెస్టారెంట్లు కూడా ఇప్పటిలా ఎక్కువగా ఉండేవి కావని గుర్తుచేసుకున్నారు.
అయితే, ఆ రెస్టారెంట్ సందర్శన తనకు ఆహారం కోసం వెతికిన అనుభవంగానే మిగిలిపోలేదని సోనియా తెలిపారు. రాజీవ్‌ను తొలిసారి చూసినప్పుడే ఆయనతో కలిసి జీవితాన్ని గడపాలనే భావన తనలో కలిగిందని చెప్పారు. తనకు కలిగిన భావనే రాజీవ్‌కూ ఉందని తర్వాత తెలుసుకున్నానని వెల్లడించారు.
రాజీవ్ అందంగా ఉండటమే కాకుండా, ఆయనలో కనిపించిన సున్నితత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని సోనియా వివరించారు. ఆయనలోని మృదుస్వభావం తొలి పరిచయంలోనే తనను ఆకర్షించిందని పేర్కొన్నారు.
స్నేహం నుంచి ప్రేమగా..
తొలిపరిచయం తర్వాత వారి బంధం స్నేహంతో ముందుకు సాగింది. విద్యార్థులుగా పార్టీలకు వెళ్లడం, కేంబ్రిడ్జ్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించడం వంటి సాధారణ అనుభవాలను ఇద్దరూ కలిసి పంచుకునేవారని సోనియా గుర్తుచేసుకున్నారు. ఇతర విద్యార్థులతో కలిసి వాలెంటైన్స్ డే వేడుకకు హాజరైన సందర్భాలనూ ఆమె ప్రస్తావించారు.
సోనియా జ్ఞాపకాలతో పాటు పాత ఛాయాచిత్రాలను కలిపి రూపొందించిన ఈ వీడియో.. రాజకీయ జీవితానికి దూరంగా, యువతలో మొదలైన వారి ప్రేమకథకు సంబంధించిన అరుదైన క్షణాలను ఆవిష్కరిస్తోంది. కాలక్రమంలో దేశ రాజకీయాల్లో కీలక స్థానాలకు చేరుకున్న ఈ ఇద్దరి జీవితాల్లోనూ ఆ తొలి పరిచయం ప్రత్యేకమైన మలుపుగా నిలిచింది.
1968లో సోనియా, రాజీవ్ గాంధీ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా 1984 నుంచి 1989 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1991 మేలో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. రాజీవ్ మరణం సోనియా జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నవంబర్ 10న పుస్తక విడుదల
‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో విడుదల కానున్న ఈ పుస్తకం సోనియా గాంధీ జీవితంలోని వ్యక్తిగత అనుభవాలను, రాజీవ్‌తో తన అనుబంధాన్ని మరింత దగ్గరగా పరిచయం చేయనుంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చేరి తన పుస్తకానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో అత్యంత కీలక నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఆమె ప్రజాజీవితం ప్రధానంగా రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పటికీ, ఈ పుస్తకం మాత్రం వ్యక్తిగత జ్ఞాపకాలు, ప్రేమ, అనుబంధం, కలిసి నిర్మించుకున్న జీవితంపై దృష్టి సారించనుంది. కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్‌లో మొదలైన పరిచయం నుంచి జీవితాంతం నిలిచిన బంధం వరకు.. సోనియా గాంధీ జ్ఞాపకాల రూపంలో ఈ ప్రేమకథను పాఠకులు తెలుసుకోనున్నారు.



No comments:
Post a Comment