Monday, 5 October 2026

యూపీలో కాంగ్రెస్ కొత్త కూర్పు



  • ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై ఎఫెక్ట్ చూపుతుందా? 
  • ఇమ్రాన్ మసూద్ నియామకంపై సర్వత్రా చర్చ


న్యూఢిల్లీ, అక్టోబర్ 5:

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. 2027 ఎన్నికల్లో పార్టీ బలాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా కొత్త టీమ్‌ను బరిలోకి దించింది. అయితే, ఈ నియామకాలు కాంగ్రెస్ మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ఎస్పీకి మిశ్రమ సంకేతాలను పంపుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితురాలిగా పేరున్న ఎమ్మెల్యే ఆరాధనా మిశ్రా-మోనాను కొత్త రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం ద్వారా.. సీట్ల సర్దుబాటుపై స్నేహపూర్వక చర్చలకు సిద్ధమన్న సంకేతాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. అయితే, అదే సమయంలో ఎస్పీ 'పెద్దన్న ధోరణి'ని బహిరంగంగా విమర్శించే ముస్లిం నేత, ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం కూటమిలో సందిగ్ధతకు తావిస్తోంది.


సీట్ల పంపకాలపై మాటల యుద్ధం

యూపీలో రాబోయే ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం నడుస్తోంది. సీట్ల విభజన 'గౌరవం, సమానత్వం' ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతుండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాల (ఇండియా కూటమి యూపీలో 43 స్థానాలు గెలుచుకుంది) ఆధారంగానే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కోరుతోంది. కాంగ్రెస్ వాదిస్తున్నట్లుగా గత ఎన్నికల్లో ఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించడానికి కూటమే కారణమని, కాబట్టి తమకు ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. మరోవైపు, సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నేతలు మీడియాలో ప్రకటనలు చేయడం మానుకోవాలని, ఏదైనా ఉంటే నేరుగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో చర్చించాలని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ హితవు పలికారు. అఖిలేష్ యాదవ్ ఎంతో విశాల హృదయం గల నాయకుడని, సరైన పద్ధతిలో చర్చిస్తే సానుకూల స్పందన ఉంటుందని పేర్కొన్నారు.


బీజేపీని ఎదుర్కొనేందుకు ఇరు పార్టీలకు ఒకరికొకరు తోడు అవసరమనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. రాష్ట్ర స్థాయి నేతల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ పూరిత వాతావరణంలో, కాంగ్రెస్ తన కొత్త నాయకత్వాన్ని, ముఖ్యంగా ఇమ్రాన్ మసూద్‌ను సీట్ల చర్చల్లో ఏ విధంగా వాడుకుంటుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...