కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని రెస్టారెంట్‌కు తాను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు చెప్పారు. అయితే, అక్కడి భోజనం మాత్రం తనకు ఏమాత్రం నచ్చలేదని సరదాగా వ్యాఖ్యానించారు.
సోమవారం ఢిల్లీలో సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ ఈ విషయాలను పంచుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తాను కేంబ్రిడ్జ్‌కు వెళ్లినప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి యూనివర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, ఆ రెస్టారెంట్‌కు ఎందుకు తీసుకెళ్తున్నాననే విషయం ఆమెకు తెలియదన్నారు.
తన తల్లిదండ్రులు తొలిసారి కలుసుకున్న ప్రదేశాన్ని ఆమెకు చూపించాలన్న ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రెస్టారెంట్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడి సిబ్బందికి తన తల్లిదండ్రులు ఇదే చోట కలుసుకున్నారని చెప్పగా, వారు వెంటనే గుర్తుపట్టినట్లు రాహుల్ వివరించారు.
ప్రేమలో పడాలనుకునేవారు ఆ యూనివర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చని, అయితే అక్కడి చికెన్ వంటకాన్ని మాత్రం తినొద్దని సరదాగా సూచించారు. తన తల్లిదండ్రులకు అక్కడి భోజనం ఎంతో నచ్చిందని, దాన్ని అద్భుతంగా గుర్తుచేసుకుంటారని, కానీ తనకు మాత్రం ఆ ఆహారం అస్సలు నచ్చలేదని చెప్పి నవ్వులు పూయించారు. కార్యక్రమం అనంతరం విలేకరులు రాహుల్‌ను మీ ప్రియురాలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించగా, ఆమె తన స్నేహితురాలని సమాధానమిచ్చారు.
