- ‘ముఠా మేస్త్రి’ జ్ఞాపకాలు చెప్పిన పరుచూరి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1993లో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘ముఠా మేస్త్రి’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 22న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
చిరంజీవి మాస్ ఇమేజ్‌ను కాపాడుతూనే అద్భుతమైన వినోదాన్ని అందించిన చిత్రమిదని పరుచూరి అన్నారు. మేస్త్రి నుంచి మంత్రి వరకు చిరంజీవి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ సినిమాలో రోజా కూడా చక్కగా నటించారని గుర్తుచేశారు. ‘సర్పయాగం’ సినిమా తర్వాత ఆమెకు ‘ముఠా మేస్త్రి’లో అవకాశం వచ్చిందని చెప్పారు.
షూటింగ్ సెట్‌కు వెళ్లిన సమయంలో రోజా తన చేయి పట్టుకుని ‘డాడీ.. డాడీ’ అంటూ ఎంతో టెన్షన్ పడిందని పరుచూరి తెలిపారు. చిరంజీవి వంటి పెద్ద హీరోతో నటించే అవకాశం రావడంతో ఆమె ఎంతో ఆనందపడిందని, ఆ సంతోషం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
ఈ సినిమా విజయంలో సంభాషణలు కీలక పాత్ర పోషించాయని పరుచూరి పేర్కొన్నారు. “ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు. ఉన్నది ఒక్కటే కులం.. లేబర్ కులం” వంటి సంభాషణలకు థియేటర్లలో అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. “టోపీ పెట్టని మహమ్మదీయుడిని, బొట్టుపెట్టని హిందువుని, సిలువ వేయని క్రైస్తవుడిని” అనే డైలాగ్‌తో హీరో మూడు మతాల వారికీ చెందినవాడిగా చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుందని వివరించారు.
విలన్ పాత్రకు కూడా ఈ సినిమాలో గుర్తుండిపోయే సంభాషణలు ఉన్నాయని పరుచూరి చెప్పారు. “న్యాయం కోసం పోరాడుతుంటే.. పోలీసులు ఇచ్చిన బహుమతి” అనే డైలాగ్ ద్వారా పోలీసుల తీరును సున్నితంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. సినిమాలో ఇలాంటి సంభాషణలు ఎన్నో ఉన్నాయని, పాటలు కూడా అద్భుతంగా ఉంటాయని అన్నారు. చిరంజీవి డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయని, క్లైమాక్స్ మరో స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రీరిలీజ్ సందర్భంగా అభిమానులు మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని పరుచూరి గోపాలకృష్ణ కోరారు.

No comments:
Post a Comment