- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీ: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక సహాయం అందించాలని, పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర క్రీడల మంత్రి, తాను కలిసి ప్రధానమంత్రి మోదీని కలిసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా’ క్రీడా పోటీలకు హాజరుకావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, కార్యక్రమానికి హాజరయ్యే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
సమావేశంలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత అధికంగా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
తెలంగాణకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలతో నెలకొన్న అంతర్రాష్ట్ర సమస్యలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగేందుకు అవసరమైన నిధులను పెద్దఎత్తున అందించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని ప్రధానమంత్రికి వివరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment