- ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్న అర్జున్ రాజ్‌పుత్
అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాక్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 48.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్ హమ్జా జహూర్ అజేయ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడు 100 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అబ్బాస్ దర్ 38, అబ్దుల్ ఖాదిర్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మనల్ చౌహాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మోహిత్ ఉల్వా రెండు వికెట్లు తీశాడు. ఇషాన్ సూద్, కావ్యా పటేల్ చెరో వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడ్డారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ అర్జున్ రాజ్‌పుత్ మాత్రం అద్భుతంగా పోరాడాడు. కేవలం 85 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 107 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అతడి పోరాటంతో భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
అర్జున్‌కు తోడుగా వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ 22 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్‌లో కావ్యా పటేల్ 23 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో అన్వయ్ ద్రవిడ్ 10, మనల్ చౌహాన్ 11 పరుగులు చేశారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్ చందాని డకౌట్ కాగా, యశ్‌బర్దాన్ చౌహాన్ ఒకటి, యశ్వీర్ గౌడ్ నాలుగు, వీకే వినీత్ ఎనిమిది, మోహిత్ ఉల్వా ఏడు పరుగులకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షాఫిక్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, సయ్యమ్ ఒక వికెట్ తీశాడు. అర్జున్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

No comments:
Post a Comment