అమెరికా: అమెరికా రాజకీయాల్లో డెమోక్రటిక్ పార్టీ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోందని తాజా ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుచుకున్న అనేక స్థానాలను ఈసారి డెమోక్రాట్లు తిరిగి కైవసం చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన 234 జిల్లాల్లో ఇప్పటికే 52 స్థానాలను డెమోక్రాట్లు దక్కించుకున్నారు.
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు 253 స్థానాల్లో విజయం సాధించగా, రిపబ్లికన్లు 155 స్థానాలకే పరిమితమయ్యారు. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. డెమోక్రాట్లు 260 స్థానాల మార్కును కూడా దాటే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అదే జరిగితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 85కు పైగా స్థానాల ఆధిక్యం లభించే అవకాశం ఉంటుంది. సభలో దాదాపు 60 శాతం ప్రాతినిధ్యం ఆ పార్టీకి దక్కుతుంది. 1990వ దశకం ప్రారంభంలో డెమోక్రాట్లు సాధించిన 267 స్థానాలే ఇప్పటివరకు ఆ పార్టీకి అత్యధిక సంఖ్య. 2008లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆ పార్టీ 257 స్థానాలను గెలుచుకుంది. తాజా ఫలితాలతో 1990 నాటి రికార్డును డెమోక్రాట్లు అధిగమిస్తారా? లేక 2008 విజయాన్ని మించిపోతారా? అన్న ఆసక్తి నెలకొంది.
