Showing posts with label CM KCR. Show all posts
Showing posts with label CM KCR. Show all posts

Saturday, 26 August 2023

బీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద


బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒకటి రెండు రోజులు మౌనంగా ఉన్నారు. టికెట్లు రానివారు బాధ పడవద్దని భవిష్యత్తులో వారికి ఇతర అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. అయితే అసంతృప్తుల్లో చాలామందికి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా మౌనంగా ఉంటే అదే అంగీకారమవుతుందని భావించిన నేతలు మెల్లగా స్వరం పెంచారు. పాలేరు టికెట్‌ ఆశించిన తుమ్మల నాగేశ్వర్‌ రావు సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఆయన ఖమ్మం వెళ్లారు. ఆయనకు టికెట్‌ రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. 


కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్టు చెప్పారు. నా జిల్లా కోసం, ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదన్నారు. గోదావరి జిల్లాలతో తన ప్రజల పాదాలు కడుగడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే తుమ్మల మాటల బట్టి చూస్తే ఆయన పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. జిల్లా మంత్రిగా అందరిని సమన్వయం చేయాల్సిన  అజేయ్‌కుమార్‌ పార్టీలో తమవర్గాన్నిఇబ్బందిపెట్టారని, తమకు  అన్యాయం చేశారని గతంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తుమ్మల కూడా నేరుగా మంత్రిపై ఆరోపణలు చేయకున్నా ఖమ్మం నుంచే పోటీ చేసి ఆయనను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో జిల్లా టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుమ్మలను గెలిపించుకుంటామని శపథం చేసిన సంగతి తెలిసిందే. 


షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమౌతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా.. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చని కలసి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో తుమ్మలకు ఖమ్మం నియోజకవర్గాన్ని ఆఫర్‌ చేసి ఉండొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సవాల్‌ విసిరిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేయించేందుకు కృషి చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, జలగం వెంకటరావులను పార్టీలోకి తీసుకొస్తే మెజారిటీ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకోవచ్చనే యోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. 


స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ బరిలో ఉంటానని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. ఆరునూరైనా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని, భూమి కొని దుక్కిదున్ని, నారు నీరు పోసి, రాశి చేస్తే.. ఎవరో వచ్చి దానిపై కూర్చుకుంటానంటే ఊరుకుంటానా? అని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కూడా పార్టీ మారొచ్చు అంటున్నారు. టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ కమిటీ వేసినా ఫలితం కనిపించడం లేదు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్‌ నుంచి తన తనయుడిని పోటీ చేయించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ తనపై వేటు వేసినా అందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. అట్లనే ఉప్పల్‌  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలతో పాటు రామగుండంలో కందుల సంధ్యారాణి లతో పాటు టికెట్లు ఆశించి భంగపడిన వారు రానున్నరోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాళ్లంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే అధికారపార్టీకి 15-20 స్థానాల్లో సొంతపార్టీ నేతల నుంచే ముప్పు తప్పేలా లేదంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ తనకు టికెట్‌ కేటాయించకపోవడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన పౌరసత్వానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నందున పార్టీ అధిష్ఠానం ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. అందుకే ఆయన సేవలను మరో రకంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించింది. 


దీనికి తోడు వామపక్షాలు కూడా తాము బలంగా ఉన్నచోట బరిలో ఉంటామన్నారు. హుస్నాబాద్‌తో పాటు తమకు పట్టున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సీపీఎం కూడా మిర్యాలగూడ, మునుగోడుతో పాటు ఖమ్మం జిల్లాలో పోటీ చేయవచ్చు. తమ బలాన్ని తక్కువ అంచనా వేసిన బీఆర్‌ఎస్‌ అధినేతకు తమ సత్తా ఏమిటో చూపెడుతామని వామపక్ష నేతలు ఇప్పటికే చెప్పారు.  దీంతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు గండిపడే ప్రమాదం ఉన్నది. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. ఆ లోగా అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీకీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీతో కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు అవగాహనకు రావొచ్చు. కలిసి పోటీ చేయవచ్చు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

నియామకాలపై అసత్య ప్రచారాలు..నిజాలు


 

సకల జనుల సంక్షేమం...


 

కర్ణాటకలో కుదిరింది... కానీ తెలంగాణలో కష్టమే


 

Tuesday, 22 August 2023

సర్వేలు పోయాయి.. సమీకరణాలు మారుతున్నాయి




అసెంబ్లీ టికెట్ల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల వారీగా దాదాపు 100 సీట్లకు అభ్యర్థులు వీరే అని మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో రాడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నువ్వా నేనా అన్న రీతిలో నేతలు బలప్రదర్శన మొదలుపెట్టారు. అసలు అధికారపార్టీలో ఏం జరుగుతున్నది? కచ్చితంగా మూడోసారి మాదే అధికారం అన్న నేతలు ఇప్పుడు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నారు? సొంతపార్టీ నేతల్లోనే చిచ్చు రాజేసే ఈ లీకులు ఎవరు ఇస్తున్నారు? కార్యకర్తలను, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసే కొందరు నేతల ప్రకటనలపై పార్టీ అధినేతల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కేసీఆర్‌ గతంలో ఏం చెప్పారు? ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి పరిశీలిస్తే...


సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ, ఇంతకంటే మంచి అభ్యర్థులు మాకు దొరుకుతారా అని అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అంతేకాదు సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, వందకు పైగా స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తలదూర్చవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. నాటి మాటలన్నీ వమ్మయ్యాయి. ఈ ఐదారు నెలల కాలంలోనే అధికార 'కారు' పార్టీలో కల్లోలం మొదలైంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలే అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోటీ అయ్యారు. ఇది ఇక్కడితోనే ఆగే అవకాశం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆశావహులు ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే అధికారపార్టీలో సీఎం చెప్పిన సర్వేలు ప్రామాణికం కాదని స్పష్టమౌతున్నది. 




నాగార్జునసాగర్‌, రామగుండం,వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, తాండూరు, ఆలేరు, నకిరేకల్‌, హుజురాబాద్‌, పెద్దపల్లి, చెన్నూరు, కోరుట్ల ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 20 స్థానాలకు పైగా అధికారపార్టీ నేతలే బలప్రదర్శనకు దిగుతున్నారు. సర్వేల సంగతి పక్కకు పోయి మారుతున్న సమీకరణాలతో అధికారపార్టీ కార్యకర్తలు, శ్రేణులు అయోమయంలోకి గురవుతున్నారు. టికెట్ల కేటాయింపు తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే అయినా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులది కూడా కీలకపాత్రే అన్నది బహిరంగ రహస్యమే.  అందుకే కొన్నినియోజకవర్గాల్లో టికెట్‌ నాదంటే నాది అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ముగ్గురు నేతలలో వారికి ఎవరైనా హామీ ఇచ్చారా?  ఇవే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు జనగామలో అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశాంతంగా ఉన్న తన నియోజకవర్గాన్ని కార్పొరేట్‌ పద్ధతిలో అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు. తనను ఎదురుకోలేక తన ఇంట్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చాడు.  ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోని వ్యక్తి ఇప్పుడు నియోజకవర్గంలో తనకే టికెట్‌ వచ్చిందని ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నిస్తూ.. ఆయనపై ధ్వజమెత్తారు. ముత్తిరెడ్డి మాటలు చూస్తే కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉన్నదని, ఆయన ఈ కుట్రలన్నీ చూస్తున్నారంటూ.. ఒకవేళ తనకు టికెట్‌ రాకపోతే ఏం జరుగుతుందో అని చెప్పకనే చెప్పారు. 


ఒక్కో నియోజకవర్గంలో నేతల బలప్రదర్శనతో టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది. నాగార్జున సాగర్‌ నుంచి తానే పోటీ చేస్తాననని హీరో అల్లు అర్జున్‌ మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంతో చంద్రశేఖర్‌రెడ్డి బలప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ముత్తిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో మారుతున్న సమీకరణాలతో అభ్యర్థుల ప్రకటనకు ముందే నాలుగైదు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు  టికెట్ల చిచ్చు రాజేయగా తీరా సమయానికి ఇంకా ఎంతమంది బైటపడుతారన్నది చూడాలి. ఇవాళ వీఎస్‌టీ-ఇందిరాపార్క్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది అన్నారు. సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ హ్యాట్రిక్‌ సంగతి ఏమో గాని కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందా? నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

Saturday, 22 April 2023

కౌశిక్‌ కంటే గెల్లుకే గ్రౌండ్‌ రిపోర్ట్‌ బాగుందట!


తెలంగాణలో ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం కూడా లేదు. అప్పుడే ప్రధాన పార్టీలలో సార్వత్రిక ఎన్నిక సందడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేసీఆర్‌ కూడా సిట్టింగులందరికీ తిరిగి టికెట్లు ఖాయమన్నారు. అయితే రాష్ట్రంలో కొన్నిస్థానాలప ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే అన్నిపార్టీలు ఒకటిరెండుసార్లు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.  ఖమ్మం జిల్లాలో పొంగులేటి బీఆర్‌ఎస్‌ను సవాల్‌ చేస్తుండగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లకు చెక్‌ పనిలో బీఆర్‌ఎస్‌ ఉన్నది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించినా ఈటలపై సానుభూతి పనిచేసింది. గతంలో కంటే మెజారిటీ తగ్గినా.. వచ్చే ఎన్నికల్లో ఈటల గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.  అధికారపార్టీ కౌశిక్‌ను హుజురాబాద్‌లో పనిచేసుకోవాలని, ఎనిమిదినెలలు నియోజకవర్గంలోనే విస్తృతంగా పర్యటించాలని సూచించింది. 

అయితే ఈటల రాజేందర్‌ను కౌశిక్ కట్టడి చేయగలరా? కేసీఆర్‌ అంచనాలను ఆయన అందుకుంటారా? అక్కడ కాంగ్రెస్‌ పార్టీ బరిలో ఉంటుండటంతో ఈ ముక్కోణపు పోటీలో ఎవరు లాభపడుతారు? ఎవరు నష్టపోతారనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మరో విద్యార్థి నేత బల్మూరి వెంకట్‌ పోటీలో ఉండొచ్చు. కాబట్టి కౌశిక్‌రెడ్డి దూకుడు వ్యవహారశైలి బీఆర్‌ఎస్‌ను గెలుపు బాటలో తీసుకెళ్తుందా? అంటే అంత తేలిక కాదంంటున్నారు. ఈటల రాజేందర్‌ ఉద్యమకారుడిగానే అధికారపార్టీ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తుంటారు.  ఉద్యమకాలంలో కౌశిక్‌ వ్యవహరించిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. రాజేందర్‌ కూడా ఉప ఎన్నిక ప్రచారంలో అధికారపార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై విమర్శలు చేయకుండా కౌశిక్‌ను, మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమనేతగా గెల్లు ఎంపికపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా  ఉద్యమకారుడికి అవకాశం దక్కిందని నిత్యం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచిన వాళ్లు కూడా గెల్లుకు టికెట్‌ దక్కడాన్ని స్వాగతించారు. అయితే నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాబల్యవర్గంగా ఉన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా కౌశిక్‌కు ఈసారి ఈటలపై పోటీలో నిలబెట్టాలని పార్టీ అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించి ఉండొచ్చు. కానీ అది ఈటలకే మేలు చేస్తుందనే వాదనలు లేకపోలేదు. 


గెల్లుకు ఈటల, కౌశిక్‌ వలె అంగబలం, అర్థబలం లేకపోవచ్చు.కానీ నియోజకవర్గంలో ఆయనపై సానుభూతి వ్యక్తమౌతున్నది. బీఆర్‌ఎస్‌ తరఫున కౌశిక్‌ కంటే గెల్లుకే గ్రౌండ్‌ రిపోర్ట్‌ అనుకూలంగా ఉన్నదట. ఓ సీనియర్‌ జర్నలిస్టు దీనిపై స్పందిస్తూ.. గెల్లు కింది నుంచి ఎదిగివచ్చిన బలహీనవర్గాలకు చెందిన నాయకుడు. ఆయన మరో అవకాశం ఇస్తే హుజురాబాద్‌లో అధికారపార్టీకి గెలుపు ఖాయమని కచ్చితంగా చెప్పకున్నా... సానుకూల అంశాలు అనేకం ఉన్నాయి అంటున్నారు. ఎన్నికలకు ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నది. కాబట్టి అప్పటివరకు పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడే అంచనాకు రావడం సరికాదంటున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆయన టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. 

Wednesday, 25 January 2023

బీఆర్‌ఎస్‌తో ఏ కూటమికి మేలు, ఏ కూటమికి ముప్పు



ఖమ్మం జి


ల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్‌, పినరయ్‌ విజయ్‌, భగవంత్‌ మాన్‌ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ నేత డి. రాజా హాజరయ్యారు. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలను కలిశారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తదితరులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వీళ్లలో చాలామంది కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పా బీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఇక ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో వేదిక పంచుకున్ననేతలంతా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవాళ్లే, కొట్లాడుతున్నవాళ్లే. అలాగే వీళ్లు ఎప్పుడూ అటు ఎన్డీఏలోనూ, బీజేపీతోనూ భాగస్వాములుగా లేరు.  బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ కలిసే ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే ఉద్యమకాలం నుంచి తెలంగాణకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం తమ అలయెన్స్‌ అని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. ఇది రాష్ట్రం వరకే పరిమితం. జాతీయస్థాయిలో రేపు బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఐఎంను కలుపుకుంటే అది అంతిమంగా బీజేపీకి లబ్ధి జరుగుతుందనే అబిప్రాయం ఉండనే ఉన్నది. 


ఈసారి కేంద్రంలో కిసాన్‌ ప్రభుత్వం రావాలి అంటున్న కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి కూడా గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈసారి తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. ఈ కూటమి 30-40 సీట్లు దక్కించుకుంటే రేపు అటు యూపీఏకు గాని, ఎన్డీఏకు గాని పూర్తి మెజారిటీ రాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ, బీజూజనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి. ఈ పార్టీలకు వచ్చే సీట్లు కూడా కీలకంగా మారుతాయి. 

అలాగే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రయోగం అంతిమంగా బీజేపీకి మేలు చేయడానికే అనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ వైఖరి మారవచ్చు, కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిప్రాయం మారవచ్చు.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా!

Friday, 9 September 2022

మునుగోడులో ముందంజ‌లో ఉన్న‌ది ఎవ‌రు?



రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాస‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో రాష్ట్ర రాజ‌కీయ మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివంగ‌త పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కూతురు స్ర‌వంతిని అభ్య‌ర్థిగా అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే రాజ‌గోపాల్ రాజీనామా ఆమోదం పొందిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ స్థానంపై దృష్టి సారించింది. ప్ర‌జాదీవెన స‌భ పేరుతో ఇప్ప‌టికే ఆ పార్టీ అక్క‌డ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఆ రోజే అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ జోలికి పోలేదు. ఎందుకంటే ఆ సీటు ఆశిస్తున్న ఆశావ‌హుల జాబితా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ స‌భ‌లో అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న జోలికి వెళ్ల‌లేదు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల  అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో ఇక టీఆర్ఎస్ ఈ రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరునే దాదాపుగా ఖ‌రారు అయ్యింది అంటున్నారు.  ఇప్ప‌టికే సీపీఐ, సీపీఎం పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన అధికార పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నున్న‌ది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార‌పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న‌ద‌ని వివిధ స‌ర్వేలు వెల్ల‌డించాయి. అయితే మునుగోడులో స‌భ పెట్టి,  అమిత్ స‌మ‌క్షంలో చేరిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే ఆయ‌న సోద‌రుడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా రాజ‌గోపాల్‌కు ఓటు వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు, నేత‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల ఆ పార్టీ నేత‌లు ఆరోపించారు. ఆ వార్త‌లు పేప‌ర్ల‌లో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు ఉప ఎన్నిక‌ల రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. 


ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న‌ద‌నేది స్ప‌ష్టంగా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు అధికార‌పార్టీ ఇప్ప‌టికీ ముందంజ‌లో ఉన్న‌ద‌ని తెలుస్తోంది. రెండు మూడు స్థానాల్లో నిలిచేది ఎవ‌ర‌నేది మ‌రికొన్నిరోజుల్లో తేలుతుంది. రెండో స్థానంలో ఉండే పార్టీనే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో పోటీ ప‌డుతుంద‌నే టాక్ కూడా ఉన్న‌ది. బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు హుజురాబాద్ ఫ‌లితం పునరావృతమ‌వుతుందా?  టీఆర్ఎస్ నేత‌లు వాద‌న ప్ర‌కారం నాగార్జున‌సాగ‌ర్ ఉప‌ ఫ‌లితం వ‌లె ఉంటుందా? అన్న‌ది చూడాలి. 

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...