- ముగింపుకు వచ్చిన అమెరికా-ఇరాన్ యుద్ధం
- ‘ఇది ఎంతమాత్రం సులభం కాదు’: శాంతి ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు
- ఇరాన్‌కు $300 బిలియన్ల ప్యాకేజీ.. హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం!
పశ్చిమాసియా లోకొన్ని నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగింపుకు తీసుకువస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం, ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి విందులో పాల్గొన్న సమయంలో ట్రంప్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన వీడియోలో.. ట్రంప్ పక్కనే కూర్చున్న మాక్రాన్, వెనుక నిలబడిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ఇతర ప్రపంచ ప్రతినిధులు చప్పట్లతో ఈ నిర్ణయాన్ని స్వాగతించడం కనిపించింది. సంతకం చేయడానికి కొన్ని క్షణాల ముందు ట్రంప్ చేతిలో పెన్ను పట్టుకుని, అక్కడ ఉన్న నేతలతో.. "నేను మీకు ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఎంతమాత్రం సులభం కాదు" అని వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ 14 సూత్రాల ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ తక్షణమే అమల్లోకి రానున్నది. ఈ ఒప్పందం ప్రకారం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలలో ఇరు దేశాల సైనిక చర్యలు తక్షణమే నిలిచిపోతాయి. అంతేకాకుండా రాబోయే 60 రోజుల్లో పూర్తిస్థాయి తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తుంది, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా సురక్షితంగా ప్రయాణించడానికి మార్గం సుగమమైంది. అలాగే ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను అమెరికా దశలవారీగా ఎత్తివేయడంతో పాటు, అంతర్జాతీయ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తుంది. దీనికి అదనంగా ఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం అమెరికా మద్దతుతో కనీసం 300 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి ప్రతిగా తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) పర్యవేక్షణలో తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై చర్చలకు సిద్ధమని ఇరాన్ పునరుద్ఘాటించింది.
ఈ చరిత్రాత్మక ఒప్పందంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికాతో శాంతి ఒప్పందం పూర్తయిందని, ఇప్పుడు ఈ నిబంధనల అమలును పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. తాము అత్యంత పటిష్టమైన , బలమైన స్థితిలోనే అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరిపామని, యుద్ధరంగంలో సాధించిన విజయాల రికార్డులే ఈ చర్చలకు పునాదిగా నిలిచాయని స్పష్టం చేశారు. ఈ శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాల నేతలు ఘనంగా స్వాగతించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని, హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు త్వరలోనే తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాల అధ్యక్షులను అభినందిస్తూ.. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ ఘోర వినాశనాన్ని అడ్డుకోగలిగామని, ఇది యావత్ ప్రపంచానికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే పరిణామమని కొనియాడారు.