Tuesday, 2 June 2026

తెలంగాణలో పోటీ చేస్తాం



ప్రాంతీయ విద్వేషాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు

రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా?



హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమేనని, ఇక్కడి ప్రతి సమస్యపై తాను స్వయంగా పర్యటించి గళం విప్పుతానని, ఏ అన్యాయం జరిగినా నిలదీస్తానని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు చాలా ప్రమాదకరమైనవని హెచ్చరించిన పవన్ కల్యాణ్, తెలంగాణకు రావద్దని చెప్పడానికి అసలు మీరెవరని, తెలంగాణ ఎవరికైనా వ్యక్తిగత జాగీరా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది భారతదేశమని, దేశంలో తాను ఏ ప్రాంతానికైనా ప్రయాణించవచ్చని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు అనుకోలేదని, కానీ ఇప్పుడు చెబుతున్నాను. తెలంగాణలో జనసేన ఉంటుంది. తాము పోటీ చేస్తామన్నారు. అట్లనే తాను తెలంగాణ అంతటా తిరుగుతానని, సమస్యలపై పోరాడాతాను అన్నారు 


పాలకుల ఆలోచనలు, ప్రజల మనోభావాలు వేర్వేరుగా ఉంటాయని చెబుతూ, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల సమాజాల మధ్య అనవసరమైన విభేదాలను రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) పరిపాలన సాగిన సమయంలో కూడా తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, అనవసరమైన ఘర్షణలను సృష్టించడంపై తనకు నమ్మకం లేదని పవన్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను, విమర్శలను ఓపికగా భరించానని, ఇలాంటి బెదిరింపులకు తాను ఎంతమాత్రం భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక తనపై వస్తున్న భూఆక్రమణల ఆరోపణలపై స్పందిస్తూ, తాను గనుక ఏదైనా చెరువును అక్రమంగా ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే, ఆ భూమిని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.

No comments:

Post a Comment

Featured post

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

 ఇరాన్ యుద్ధ సెగ 2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం రూపాయి విలువపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక విశ్లేషణ! అంతర్జాతీయం...