Tuesday, 2 June 2026

నా తెలంగాణ ఒక చరిత్ర

అరవై ఏండ్ల పోరాటం.. అమరుల త్యాగఫలం ఫలితం తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాల కంటే తెలంగాణకు భిన్నమైన చరిత్ర ఉన్నది. స్వతంత్య్రం ఏర్పడే నాటికి దేశంలో కలిసిన అనేక సంస్థానాల్లో హైదరాబాద్‌ అప్పటికే అభివృద్ధి చెంది ఉన్నది. ప్రపంచంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అట్లా అన్నిరంగాల్లో ముందున్న  హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపారు. ఒప్పందాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు భావ సారూప్యత లేదు. సాంస్కృతికంగా కూడా ఈ రెండు ప్రాంతాలు చాలా భిన్నమైనవి. తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే అనే పిడివాదం తప్ప తెలంగాణకు ఆంధ్రాకు ఎప్పుడూ పోలిక లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. ఫజల్‌ అలీ కమిషన్‌ కూడా 1962 సార్వత్రిక ఎన్నికల నాటి వరకు వాయిదా ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కానీ ఆంధ్ర నేతల లాబీయింగ్‌ కు తలొగ్గిన నాటి నెహ్రూ ప్రభుత్వం కండీషన్ల మీద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.  ఆంధ్ర రాష్ట్రంతో కలుపవద్దని తెలంగాణ వాదులు ఎందుకు అన్నారో త్వరగానే తేలిపోయింది. ఒప్పందాలన్నీ తుంగలో తొక్కారు. ఇక్కడి నిధులు, నీళ్లు, నియామకాలు కొల్లగొట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అందుకే 1969 నాటికి మా రాష్ట్రం మాగ్గావాలె అని ఉవ్వెత్తున్న ఉద్యమం ఎగిసిపడింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 369 మందిని కాల్చివేసింది. 



ముల్కీ రూల్స్‌ చారిత్రక తీర్పులు




1969 జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తొలిరోజుల్లో, స్థానికత రక్షణలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969 జనవరి 21న ప్రతిష్టాత్మకమైన జీఓ నంబరు 36ను జారీ చేసింది. అయితే, ఈ జీఓ వెలువడక ముందే విద్యుత్ మండలి (APSEB) నియామకాలకు ముల్కీ నిబంధనలు వర్తించవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుప్పుస్వామి తీర్పునివ్వడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు జీఓ 36 రాజ్యాంగబద్ధతను సవాలు చేయగా, హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి ఆ జీఓ చెల్లదంటూ కొట్టివేశారు. అంతేకాకుండా, తెలంగాణ వారికి ఉద్యోగ రక్షణలు కల్పించిన 1957 నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3 రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(3)కి విరుద్ధమని, ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే ప్రత్యేక నివాస అర్హతలు కల్పించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు చేయగా, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి మరియు జస్టిస్ ఆవుల సాంబశివరావులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ చట్టాన్ని సమర్థిస్తూ జీఓ 36 రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని తీర్పునిచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించింది.


కాని ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు; ఎ.వి.ఎస్. నర్సింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఈ జీఓను సుప్రీంకోర్టులో సవాలు చేయగా, 1969 మార్చి 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జీఓ 36ను, 1957 చట్టంలోని సెక్షన్ 3ను రాజ్యాంగ విరుద్ధమంటూ పూర్తిగా రద్దు చేసింది. దీనితో తెలంగాణలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవగా, 1970 డిసెంబరు 9న పి. లక్ష్మణరావు కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమరయ్య నేతృత్వంలోని ఫుల్ బెంచ్ మరో కీలక మలుపు తిప్పింది. సుప్రీంకోర్టు కేవలం 1957 చట్టాన్ని మాత్రమే కొట్టివేసిందని, కాబట్టి ఆ చట్టం కంటే ముందు అమల్లో ఉన్న నిజాం కాలం నాటి పాత ముల్కీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని తీర్పునిచ్చింది. అయితే, 1972లో వి. వెంకట్రెడ్డి కేసులో చీఫ్ జస్టిస్ ఓబుల్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో పాత ముల్కీ రూల్స్ చెల్లవని మళ్లీ బాంబు పేల్చింది. ఈ బెంచ్‌లో ఉన్న ఏకైక తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ, పాత ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని తన ప్రసిద్ధ భిన్న తీర్పును రికార్డు చేశారు.


హైకోర్టు ఇచ్చిన ఈ వ్యతిరేక తీర్పుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, దేశ అత్యున్నత న్యాయస్థానం తెలంగాణకు చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చింది. అక్టోబర్ 3, 1972న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎమ్. సిక్రీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును పక్కనపెట్టి, జస్టిస్ కొండా మాధవరెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించింది. రాజ్యాంగంలోని ప్రకరణ 35(బి) ప్రకారం నిజాం నాటి ముల్కీ నిబంధనలు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయని మరియు అవి పూర్తిగా రాజ్యాంగబద్ధమైనవని తేల్చి చెప్పింది. ఈ చారిత్రక తీర్పుపై ఇక ఎలాంటి అప్పీలుకు అవకాశం లేకపోవడంతో, న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయాయని, ముల్కీ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని నాటి ముఖ్యమంత్రి పి.వి. నర్సింహారావు అధికారికంగా ప్రకటించారు. ఈ తీర్పుతో ముల్కీ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు కావడం ప్రారంభమైంది. అయితే, తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ 1972 అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర ప్రాంతంలో 'జై ఆంధ్రా' ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభమైంది.



1972 నాటి నుంచి 2014 వరకు తెలంగాణ  ఉద్యమం కొనసాగింది. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్రం రాజకీయ డిమాండ్‌ గా మారింది. కానీ 1996 నుంచే మేధావులు, విద్యావంతులు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఫణికర మల్లయ్య నాటి సీఎం చంద్రబాబు నాయుడు ను మా తెలంగాణ మాకు కావాలి అని నిలదీసేంత చైతన్యం తీసుకొచ్చింది. తన జీవితకాలమంతా తెలంగాణ కోసం కొట్లాడిన ఆచార్య కొత్త పల్లి జయశంకర్‌ చెప్పినట్టు తెలంగాణపై వేసినన్ని కమిటీలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేయలేదన్నది వందశాతం వాస్తవం.. ఫజల్‌ అలీ కమిషన్‌ మొదలు శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరించిన ఏకైక వ్యక్తి . తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలున్నాయి.   ముఖ్యంగా కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష, విద్యార్థులు, సకల జనులు రోడ్లపైకి వచ్చి చేసిన 11 రోజుల ఉద్యమ (2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు) ఫలితంగా చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. దీంతో అప్పటివరకు జై తెలంగాణ అన్న ఆంధ్రపార్టీలన్నీ యూటర్న్‌ తీసుకున్నాయి. డిసెంబర్‌ 23 ప్రకటన నాటికి నారా చంద్రబాబు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిలు కలిసి ఆడిన నాటకంలో నాటి పీఆర్‌పీ అధ్యక్షుడు చిరంజీవి పాత్రధారి. అయినా తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదు. పోరాటలు, వందలాది బలిదానాలు దేశ పార్లమెంటును కదిలించాయి. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ప్రజా తీర్పు ద్వారా స్పష్టమైన  సంకేతం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని తేల్చిచెప్పారు.  ఇదందా చరిత్ర. దీన్ని ఎవరూ మార్చలేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటో నిక్షిప్తమై ఉన్నది. కొత్త మతం పుచ్చుకున్న వాళ్లకు నామాలు ఎక్కువ అన్నట్టు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకున్నంత మాత్రానా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. 



రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సమయంలో నాటి ఉద్యమనేత కేసీఆర్‌ చెప్పింది ఒక్కటే. ప్రాంతాలు విడిపోదాం. ప్రజలుగా కలిసుందాం అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఉద్వేగపూరిత ప్రసంగాలను పరిగణనలోకి తీసుకున్నకొంతమంది ఆందోళన చెందారు. కానీ పాలకుడిగా తన బాధ్యత ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అయినదానికి కానిదానికి పేచీలు పెట్టినా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. శాంతిభద్రల విషయంలో రాజీ పడలేదు. అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. దాని ఫలితంగా మొదటి రెండు ఎన్నికల్లోనే కాదు 2023 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికి జనాలు జై కొట్టారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం జరుగుతున్నది. ఇచ్చిన హామీ సంగతి అటుంచితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే అనేక ప్రయత్నాలు రేవంత్‌ ప్రభుత్వం చేసింది. అందుకే మళ్లీ తెలంగాణ సమాజం నినదిస్తున్నది. తెలంగాన అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజాసంఘాలు, ప్రజలు మళ్లీ పోరు బాట పట్టారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ పవన్‌ కల్యాణ్‌ లాంటి వాళ్లు దానిని ఎదుర్కోలేక తెలంగాణపై దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పొద్దున లేస్తే తానే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని గప్పాలు కొడుతుంటారు. మరి ఈ పుష్కరకాలంలో అమరావతిలో ఒక సచివాలయాన్ని ఎందుకు నిర్మించలేదు అంటే సమాధానం ఉండదు. హైదరాబాద్‌ కు శతాబ్దాల చరిత్ర ఉన్నది. అది ఒక స్వతంత్ర దేశంగా ఉన్న నాటి నుంచి వెల్లడి పాలనా కాలంలో, ఆ తర్వాత స్వరాష్ట్రంగా, అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్నా నాటి అభివృద్దికి కొనసాగింపు మాత్రమే. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ పదాన్ని నిషేధించిన చోటనే జై తెలంగాణ అనిపించిన ఘనత  తెలంగాణ ఉద్యమానిది. నాటి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన నాటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక రాజధాని. దాన్ని నెరవేర్చే ప్రయత్నం అక్కడి పాలకులు ఇప్పటికీ చేయలేదు. కాగితాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కనిపిస్తుంది. ముందు అక్కడి ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని నిర్మాణం, హైదరాబాద్‌ లాంటి నగర నిర్మాణం కోసం కృషి చేయాలి. అంతేగాని తెలంగాణ పై దండయాత్ర చేస్తే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.  చివరగా తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరకులకు జోహర్లు. ఆచార్య కొత్త పల్లి జయశంక్‌ సార్‌కు జోహార్లు. తెలంగాణ కోసం దశాబ్దాల పాటు కొట్లాడిన ప్రజలకు జేజేలు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. 


No comments:

Post a Comment

Featured post

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

 ఇరాన్ యుద్ధ సెగ 2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం రూపాయి విలువపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక విశ్లేషణ! అంతర్జాతీయం...