- డెమొక్రాట్లు, మీడియాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం
పశ్చిమాసియా సంక్షోభంపై అమెరికా ప్రధాన స్రవంతి మీడియా, డెమొక్రాటిక్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ ఇరాన్ దేశం అమెరికా ముందు పూర్తిగా మోకాళ్లపై పడి, లొంగిపోయినట్లు ప్రకటించినా సరే, ఇక్కడ ఉన్న మీడియా, డెమొక్రాట్లు దానిని ఇరాన్ సాధించిన అద్భుత విజయంగానే చిత్రీకరిస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో పెట్టిన పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులు, మీడియా సంస్థలు తన పరిపాలనపై తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇరాన్ సైన్యం తన ఆయుధాలను కిందపడేసి, తెల్లజెండా ఊపుతూ చేతులెత్తి తాము లొంగిపోతున్నామని టెహ్రాన్ వీధుల్లో కేకలు వేసినా, వారి నావికాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంగీకరించినా సరే.. ఇక్కడి విపక్షాలు మారవని ట్రంప్ పేర్కొన్నారు. 'ది ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్', 'ది చైనా స్ట్రీట్ జర్నల్' (వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉద్దేశిస్తూ), 'టోటల్ అవినీతిమయమైన సీఎన్‌ఎన్' వంటి సంస్థలు ఇరాన్‌దే పైచేయి అయిందంటూ తప్పుడు కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తాయని మండిపడ్డారు. డెమొక్రాట్లను 'డుమాక్రాట్లు' (Dumacrats) అని సంబోధిస్తూ, వారంతా పూర్తిగా పిచ్చివాళ్లయిపోయారని, విచక్షణ కోల్పోయారని మండిపడ్డారు. ఇరాన్‌తో శాంతి చర్చలు వేగంగా సాగుతున్నాయని, తాము అనుకున్న విధంగానే అగ్రరాజ్య వ్యూహాలు ఫలించబోతున్నాయని చెబుతూనే, మీడియా దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
No comments:
Post a Comment