Sunday, 12 July 2026

రాముడి విరాళాల చోరీ.. సూత్రధారులకు సేఫ్ ఎగ్జిట్ ఇచ్చిన మోడీ


  • అయోధ్య చందా కుంభకోణంపై సిట్‌ దర్యాప్తును తప్పుబడుతూ జైరాం రమేష్  ఆరోపణలు
  • నేడు సుప్రీంకోర్టులో విచారణ వేళ దేశవ్యాప్తంగా పతాక స్థాయికి చేరిన రాజకీయ రగడ!


అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దొంగతనం ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ చందా కుంభకోణంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆదివారం  ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కోట్ల మంది రామభక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సాగించిన "మహా మోసం" అని ఆయన అభివర్ణించారు. సామాజిక మాధ్యమం ఎక్స్  వేదికగా స్పందించిన జైరాం రమేష్.. దేవుడి పేరుతో చందాల దొంగతనం చేయడం, తెరవెనుక పెద్ద నెట్‌వర్క్ నడపడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో నిజాలు బయటకు రాకుండా చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) వాడుకుంటూ, ప్రధాని మోదీ , బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వం తమకు అత్యంత ఆప్తులైన అసలు సూత్రధారులకు ముందస్తుగానే ‘సేఫ్ ఎగ్జిట్’ (సురక్షితమైన నిష్క్రమణ) కల్పించాయని ఆరోపించారు. యూపీ పోలీసుల చర్యలు కేవలం ఈ చీకటి నాటకం వెనుక ఉన్న అసలైన నిందితులను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని ఆయన దుయ్యబట్టారు.



ఈ విరాళాల దొంగతనంపై ప్రధానమంత్రి తన మౌనాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా 48 ప్రెస్ కాన్ఫరెన్స్‌లను నిర్వహించిందని జైరాం రమేష్ గుర్తుచేశారు. దీనికంటే ముందు జూన్ 26 నుండి జూలై 9 వరకు న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రధానిని సమాధానం కోరుతూ 8 విలేఖరుల సమావేశాలు నిర్వహించామని తెలిపారు. కోట్ల మంది హిందువుల సెంటిమెంట్లను గాయపరిచిన ఈ చందాల చోరీపై ప్రధాని మోడీని బాధ్యుడిని చేసేవరకు, ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, ఆలయ కౌంటింగ్ రూమ్‌లోని సిబ్బంది నగదు కట్టలను తమ బట్టలు, జేబులు, షూలలో దాచి తరలించారని, ఇది ఒక పద్ధతి ప్రకారం నిరంతరం సాగిన వ్యవస్థీకృత దొంగతనమని ఎస్ఐటీ ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం.

No comments:

Post a Comment

Featured post

రాముడి విరాళాల చోరీ.. సూత్రధారులకు సేఫ్ ఎగ్జిట్ ఇచ్చిన మోడీ

అయోధ్య చందా కుంభకోణంపై సిట్‌ దర్యాప్తును తప్పుబడుతూ జైరాం రమేష్  ఆరోపణలు నేడు సుప్రీంకోర్టులో విచారణ వేళ దేశవ్యాప్తంగా పతాక స్థాయికి చేరిన ర...