- తెలంగాణ సర్కార్‌కు కేటీఆర్ అల్టిమేటం
- గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
- కన్నెపల్లి పంప్ హౌస్‌ను 60 వేల మందితో ముట్టడిస్తాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరిక
- పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణలో సాగునీటి విడుదల, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (BRS) యుద్ధం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించి, అందుబాటులో ఉన్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో 50 నుండి 60 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్‌ను ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీరు వృథాగా పోతున్న తీరును పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ బృందంతో కలిసి వెళ్లిన కేటీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తక్షణమే స్పందించి అక్కడి బాహుబలి పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తామే స్వయంగా కన్నెపల్లికి మార్చ్ నిర్వహించి, పంప్ హౌస్‌ను ముట్టడించి పంపులను ఆన్ చేయిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు, కేటీఆర్ ,సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బయలుదేరిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్రయాణిస్తున్న వాహనాలను పోలీసులు అక్కడక్కడా అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. జనగామ జిల్లా పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై బారికేడ్లు ఉంచి కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. బీఆర్‌ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం, లోటు వర్షపాతం మరియు ప్రభుత్వ చేతకానితనం వల్ల తెలంగాణ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని , కరవును ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాలను లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటికే 26 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఉపయోగించకపోవడం వల్లే లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మండిపడ్డారు. వాతావరణ నిపుణులు ఎల్ నినో గురించి పదే పదే హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. కరవును ఎదుర్కొని వ్యవసాయాన్ని రక్షించాల్సింది పోయి, నీటిని వృథాగా పోనిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ నీరిస్తే పంటలు ఎక్కువగా పండి, వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని, ఎరువులు సరఫరా చేయాలని, రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం కావాలనే నీటిని నిలిపివేస్తోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిందలు వేయడం ఆపి, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. పద్ధతి ప్రకారం నిర్వహిస్తే రాష్ట్రాంతటికీ నీరిచ్చేందుకు సంపూర్ణ సామర్థ్యంతో సిద్ధంగా ఉందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
No comments:
Post a Comment