- ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ‘రామ్ రక్షా ఆందోళన’
- హనుమాన్ చాలీసా పారాయణంతో నిరసనలు
ముంబై:అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వివాదం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిధుల అక్రమాలపై భారతీయ జనతా పార్టీ (BJP) నిలదీస్తూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ముంబైలోని దాదర్ వేదికగా ‘రామ్ రక్షా ఆందోళన’ పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు వెల్లడిస్తూ.. దాదర్‌లోని హనుమాన్ దేవాలయం సాక్షిగా ప్రారంభమయ్యే ఈ ఉద్యమం కేవలం ముంబైకే పరిమితం కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా, ఆపై దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుందని స్పష్టం చేశారు. కోట్ల మంది భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల సొమ్ముతో పాటు సీతాదేవి బంగారు మంగళసూత్రం, బంగారు రామచరితమానస్ ప్రతి, శ్రీరాముడి ఆభరణాలు దొంగిలించబడ్డాయని సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ దోపిడీకి పాల్పడిన వారంతా బీజేపీకి చెందినవారేనని మండిపడుతూ.. గతంలో గుడులను దోచుకున్న శక్తులతో వారిని పోల్చారు.
మరోవైపు ఈ నిరసనల గురించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. హిందూత్వాన్ని వదులుకోని భక్తులంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణంతో ఈ ఆందోళనలు కొనసాగుతాయని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి రాముల వారి ఆలయం నుండి దొంగిలించిన సొమ్మును వాడుతున్నారంటూ ఆయన ‘ఆపరేషన్ రామ్ మందిర్’ పేరిట సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పినట్లు హిందువులు ఇకపై బాధితులుగా మిగిలిపోరని, రాముడి సొమ్మును లూటీ చేసిన వారిని భక్తులు ఎప్పటికీ క్షమించరని ఉద్ధవ్ హెచ్చరించారు. ఈ కఠిన సమయంలో రాజకీయాలకు అతీతంగా రాముడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పాలని శివసేన (యూబీటీ) పిలుపునిచ్చింది.
No comments:
Post a Comment