- ఇరాన్ నేతలందరినీ ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్‌లో ఇరాన్ దేశపు అగ్రశ్రేణి రాజకీయ, సైనిక నాయకులందరూ ఒకే చోట గుమిగూడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఒక్క దెబ్బతో (ఒక్క దాడితో) వారందరినీ పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం మాకు లభించింది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన, సైనిక పరంగా తాము ఎంత శక్తివంతమైన వ్యూహాత్మక స్థితిలో ఉన్నామో చెప్పడానికి ఈ ఉదాహరణను వాడుకున్నారు. ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలందరూ భద్రతాపరమైన ముప్పులను పక్కనబెట్టి ఒకే బహిరంగ ప్రదేశంలో అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొనడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సైనిక కోణంలో చూస్తే శత్రుదేశ నాయకత్వాన్ని పూర్తిగా అణచివేయడానికి అది అత్యంత అనుకూలమైన సమయమని, అయితే తాము దౌత్యానికే ప్రాధాన్యం ఇస్తున్నామని పరోక్షంగా పేర్కొన్నారు.
అయితే, ఈ విధమైన దూకుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతానికి ఇరాన్‌తో యుద్ధం చేసే ఉద్దేశం అమెరికాకు లేదని, శాంతియుత మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖతార్ , పాకిస్తాన్‌ల మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరుగుతున్న 14-అంశాల అవగాహన ఒప్పంద (MoU) చర్చలు చాలా సానుకూల దిశగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్ ఇప్పటికే తమ ప్రధాన డిమాండ్లు ,షరతులు అన్నింటికీ దాదాపు అంగీకరించిందని, ఇరు దేశాల మధ్య శాంతి పునరుద్ధరణకు ఈ చర్చలు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమేనీ అంత్యక్రియల సంతాపాది కార్యక్రమాలు ముగిసిన వెంటనే తదుపరి రౌండ్ చర్చలు ప్రారంభం కానున్నాయని, పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతలను కాపాడటమే తమ పరమావధి అని ట్రంప్ వివరించారు.
No comments:
Post a Comment