Sunday, 5 July 2026

అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ అగ్రనేతల ప్రతిజ్ఞ


  • శత్రువుల మెడలు వంచుతామంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
  • లీడర్ మరణానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ లను వదిలిపెట్టేది లేదని ప్రకటన
  •  టెహ్రాన్ వీధుల్లో ఉప్పెనలా ముంచెత్తిన లక్షలాది మంది ప్రజలు
  • భద్రతా కారణాలతో తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉన్న నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ!


ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ రాజకీయ, సైనిక అగ్రనాయకత్వం భావోద్వేగానికి లోనవడంతో పాటు శత్రుదేశాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఖమేనీ చూపిన విప్లవాత్మక మార్గంలోనే తాము పయనిస్తామని శపథం చేసిన నేతలు.. ఆయన మరణానికి కారణమైన శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వీడ్కోలు వేడుకల రెండవ రోజైన ఆదివారంనాడు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఐఆర్ఐబీ (IRIB) తో మాట్లాడిన ఇరాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సుప్రీం లీడర్ మరణానికి కారణమైన వారి మెడలు వంచుతామని, వారిని కచ్చితంగా జవాబుదారీ చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ దళాలను పరోక్షంగా హెచ్చరించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కుద్స్ ఫోర్స్ డిప్యూటీ కోఆర్డినేటర్ బ్రిగేడియర్ జనరల్ ఇరాజ్ మస్జెడి మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు ఇస్లామిక్ వ్యవస్థ కోసం పోరాడిన అమరవీరుడైన తమ నాయకుడికి ఈ వీరమరణం కంటే దక్కాల్సిన పెద్ద బహుమతి మరొకటి లేదన్నారు.


ఇదే వేదికపై నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అమర ఇమామ్ ఆశయాలను, ఆయన వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. కుద్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రెజా ఆరిఫ్ కూడా ఖమేనీ సేవలను కొనియాడారు. విప్లవ నేత ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తమపై మరింత పెరిగిందని వారు పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 28 న జరిగిన అమెరికా-ఇశ్రాయేల్ దాడుల్లో అలీ ఖమేనీ , ఆయన కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. దీనివల్ల పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలం భీకర పోరు సాగింది. అయితే గత నెలలోనే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు హార్ముజ్ జలసంధి, అణు కార్యక్రమాలపై 60 రోజుల సాంకేతిక చర్చల కోసం ఒక అవగాహన ఒప్పందంకుదిరింది.



ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా వద్ద శనివారం నుండి ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, ఆదివారం నాటి బహిరంగ అంత్యక్రియల ప్రార్థనల కోసం టెహ్రాన్ వీధుల్లోకి లక్షలాది మంది ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ గా నియమితులయ్యారు. అయితే, ఆయనను కూడా హతమారుస్తామంటూ ఇజ్రాయెల్ నుంచి వస్తున్న వరుస బెదిరింపులు, కఠినమైన భద్రతా కారణాల దృష్ట్యా.. టెహ్రాన్‌ లో ఆరు రోజుల పాటు జరిగే తన తండ్రి అంత్యక్రియల వేడుకలకు మొజ్తబా ఖమేనీ దూరంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడ...