Showing posts with label #SupremeCourtOfIndia #West BengalElections2026 #JudicialSafety #CJI #WestBengalPolitics #CentralForces #ElectionCommission #MaldaIncident #LegalUpdateIndia #BreakingNewsIndia. Show all posts
Showing posts with label #SupremeCourtOfIndia #West BengalElections2026 #JudicialSafety #CJI #WestBengalPolitics #CentralForces #ElectionCommission #MaldaIncident #LegalUpdateIndia #BreakingNewsIndia. Show all posts

Thursday, 2 April 2026

బెంగాల్ సర్కారుపై సుప్రీంకోర్టు 'సింహ గర్జన'


  • జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై సీజేఐ తీవ్ర ఆగ్రహం! 
  • చీఫ్ జస్టిస్ ఫోన్ చేసినా స్పందించరా? 
  • విచారణకు సీబీఐ లేదా ఎన్‌ఐఏను రంగంలోకి దించాలని ఎన్నికల సంఘానికి ఆదేశం!



న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (SIR) విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఆందోళనకారులు గంటల తరబడి నిర్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు గురువారం  కఠినంగా స్పందించింది. న్యాయ వ్యవస్థ నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా కుట్రతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ రంగంలోకి దిగి రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు ఫోన్ చేసినా, అర్థరాత్రి వరకు అధికారులకు రక్షణ కల్పించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

  • అసలేం జరిగింది?

మాల్దా జిల్లాలో బుధవారం ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తున్న సమయంలో, పేర్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు ఏడుగురు అధికారులను (వీరిలో ముగ్గురు మహిళలు) సాయంత్రం 4 గంటలకే ఒక గదిలో నిర్బంధించారు. సమాచారం అందినప్పటికీ జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. రాత్రి 11 గంటల వరకు ఎటువంటి సాయం అందకపోవడంతో పరిస్థితి విషమించింది. చివరకు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేసి అధికారులను రక్షించాల్సి వచ్చింది. ఈ జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడుతూ, రాష్ట్ర అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు అధికారాన్ని సవాల్ చేశారని వ్యాఖ్యానించింది.


  • సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ ఘటనపై సుప్రీంకోర్టు కేవలం మౌఖిక హెచ్చరికలతో సరిపెట్టకుండా కఠిన ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో ప్రతి ఒక్కరూ రాజకీయ భాషే మాట్లాడుతున్నారని, అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తమకు తెలుసని సీజేఐ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కోర్టు ఈ  నిర్ణయాలు తీసుకుంది

  • కేంద్ర బలగాల మోహరింపు: జ్యుడిషియల్ అధికారులకు భద్రత కల్పించేందుకు , సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు తక్షణమే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఎన్నికల సంఘాన్ని (EC) ఆదేశించింది.
  • కేంద్ర దర్యాప్తు: ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు సీబీఐ (CBI) లేదా ఎన్‌ఐఏ (NIA) చేత విచారణ జరిపించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించింది.
  • షోకాజ్ నోటీసులు: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కారణ కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, న్యాయాధికారుల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Featured post

ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే ప్రాణం

  పరిశుభ్రమైన, నవీకరించిన ఓటర్ల జాబితా అవసరమన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిశుభ్రమైన, ఎప్పటికప్పుడు నవీకరించబడిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాని...