Thursday, 3 September 2026

ఆకాశంలో నిఘా నేత్రం



  • భారత్‌ తొలి జియో-ఆర్బిట్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం


శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారిగా జియో-ఆర్బిట్‌లో పనిచేసే అధునాతన ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా కీలక రంగాల్లో రియల్‌టైమ్‌ భూ చిత్రాలను అందించడంలో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.


  • 27 గంటల కౌంట్‌డౌన్‌.. తెల్లవారుజామున ప్రయోగం


బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్‌ సజావుగా పూర్తయింది. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. 2,367 కిలోల బరువున్న EOS-05 ఉపగ్రహాన్ని రాకెట్‌ మోసుకెళ్లింది. వర్షం పడుతున్నప్పటికీ.. తెల్లవారుజామున కావడంతో సమయం అసాధారణంగా ఉన్నప్పటికీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఉత్సాహంతో శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల అనంతరం EOS-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (సబ్‌-GTO)లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.


  • ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా EOS-05


ఈ ఉపగ్రహాన్ని మిషన్‌లో పాల్గొన్న ఓ సీనియర్‌ శాస్త్రవేత్త ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా అభివర్ణించారు. భూమిపై జరుగుతున్న పరిణామాలను దాదాపు రియల్‌టైమ్‌లో పరిశీలించేందుకు ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి రంగాలకు అవసరమైన కీలక సమాచారాన్ని అందించనుంది.ప్రస్తుతం అనేక ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాలు లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO)లో పనిచేస్తున్నాయి. అయితే EOS-05 భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్‌ ఆర్బిట్‌లో పనిచేయనుంది. ఈ కక్ష్యలో ఉపగ్రహం భ్రమణ వేగం భూమి భ్రమణ వేగంతో సరిపోలేలా ఉంటుంది.జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17.. భారత జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (GSLV) సిరీస్‌లో 19వ ప్రయోగం. మూడు దశల ఈ రాకెట్‌ 51.7 మీటర్ల పొడవు, 420.5 టన్నుల లిఫ్ట్‌ఆఫ్‌ బరువుతో ఉంది. మూడో దశలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు.


  • 2021 విఫల ప్రయోగానికి కొనసాగింపుగా..


జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17/EOS-05 మిషన్‌ను 2021లో విఫలమైన GSLV-F10/EOS-03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో 307 సెకన్లకే ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌ మిషన్‌ను నిలిపివేసింది. అనంతరం నిర్వహించిన విశ్లేషణలో క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌లో తలెత్తిన లోపమే మిషన్‌ వైఫల్యానికి కారణమని ఇస్రో వెల్లడించింది.


  • ఎనిమిది నెలల తర్వాత ఇస్రోకు మరో ప్రయోగం


దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఇస్రోకు చెందిన PSLV-C62 రాకెట్‌ కీలకమైన మూడో దశలో ‘అసాధారణత’ తలెత్తడంతో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ఏకైక ప్రయోగం అదే కాగా.. అది విఫలమైంది. అంతకుముందు 2025 మేలో చేపట్టిన PSLV-C61/EOS-09 ప్రయోగం కూడా విజయవంతం కాలేదు. మోటార్‌ ప్రెజర్‌ సమస్య కారణంగా చాంబర్‌ ప్రెజర్‌లో తగ్గుదల ఏర్పడటంతో ఆ మిషన్‌ విఫలమైంది.



  • భారత్‌కు కీలక వ్యూహాత్మక సమాచారం


EOS-05 విజయవంతంగా కక్ష్యలోకి చేరిన అనంతరం ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 వాహక నౌక EOS-05ను అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు.ఉపగ్రహం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ప్రత్యేక ఇమేజింగ్‌ ఉపగ్రహంగా EOS-05 నిలుస్తుందని నారాయణన్‌ చెప్పారు. దేశానికి అవసరమైన కీలక వ్యూహాత్మక సమాచారాన్ని అందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ మిషన్‌ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Featured post

ఇస్రోకు మరో అద్భుత విజయం.. గర్వకారణమైన క్షణం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4: జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర ...