- పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర విశేషాలు
హైదరాబాద్: పవన్ కల్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. తెరపై పవర్‌స్టార్ కనిపిస్తే చాలు.. థియేటర్లు కేరింతలు, నినాదాలతో దద్దరిల్లిపోతాయి. ‘యే పవన్ నహీ.. ఆంధీ హై’ (పవన్ అంటే గాలి కాదు.. తుపాను) అంటూ అభిమానులు చేసే సందడి ఆయనకున్న క్రేజ్‌కు అద్దం పడుతుంది. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 30కి మించి సినిమాలు చేయకపోయినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పవన్ కల్యాణ్. నేడు (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇవి..
‘చిరంజీవి తమ్ముడినని చెప్పుకునేవాణ్ని కాదు’
చదువుకునే రోజుల్లో తాను చిరంజీవి తమ్ముడిననే విషయం ఇతరులకు తెలియకూడదని అనుకునేవాడినని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో చెప్పారు. ‘‘చిరంజీవిని ఇష్టపడనివారితో గొడవ పడటం నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఏదైనా తప్పు చేస్తే.. ‘ఏరా.. సినిమా వేషాలు వేస్తున్నావా?’ అని అనేవారు. ఆ మాట నాకు చాలా చిరాకు తెప్పించేది. మా అన్నయ్య మాత్రం ‘నువ్వు మరీ సెన్సిటివ్‌గా ఉంటున్నావు. ఇలాగైతే జీవితంలో ఇబ్బందులు పడతావు’ అని చెప్పేవారు’’ అని గుర్తుచేసుకున్నారు.
సమోసా కొనుక్కునేందుకు కూడా డబ్బులుండేవి కావు!
ఏడో తరగతి వరకు తనకు తల్లి పాకెట్ మనీ ఇచ్చేవారు కాదని పవన్ చెప్పారు. సినిమా చూడటానికి వెళ్తానంటే టికెట్‌కు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చేవారట. అయితే ఇంటర్వెల్‌లో సమోసా తినాలనే కోరిక ఉన్నా.. దాన్ని కొనుక్కునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడేవాడినని తెలిపారు. ‘‘ఇప్పుడు ఎన్ని రకాల సమోసాలు తిన్నా.. చిన్నప్పుడు కొనుక్కోలేకపోయిన ఆ సమోసానే ఎంతో రుచిగా అనిపిస్తుంది’’ అని నవ్వుతూ చెప్పారు.
పంతానికి పోయి.. బైక్ సైలెన్సర్ పట్టుకుని!
చిన్నతనంలో తన మొండితనం కారణంగా ఓసారి చేయి కాల్చుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. బైక్ సైలెన్సర్ వేడిగా ఉంటుందని తెలిసినా.. అది చల్లగా ఉంటుందని స్నేహితులతో వాదించారట. ‘‘అయితే పట్టుకుని చూపించు’’ అంటూ స్నేహితులు సవాల్ చేయడంతో నిజంగానే సైలెన్సర్ పట్టుకున్నారట. దీంతో అరచేయి మొత్తం కాలిపోయిందని తెలిపారు. ఆ ఘటనను జీవితంలో ఓ గుణపాఠంగా తీసుకున్నానని చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నారంటే..
చిన్నతనంలో తాను శారీరకంగా బలంగా ఉండేవాడిని కాదని పవన్ చెప్పారు. ఎవరిపైనైనా కోపం వచ్చినప్పుడు ఎదురుదాడి చేయాలనిపించేదని.. అదే సమయంలో ఇతరులు తనపై దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకోవాలంటే కొన్ని విద్యలు తెలిసి ఉండాలని భావించానని తెలిపారు. అలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టానని చెప్పారు. ‘‘మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల నాకు సహనం కూడా పెరిగింది’’ అని పేర్కొన్నారు.
భయం, సిగ్గు ఎక్కువే!
తనకు అందరి ముందు నటించడం, డ్యాన్స్ చేయడం అంటే ఇప్పటికీ కొంత సిగ్గేనని పవన్ చెప్పిన సందర్భాలున్నాయి. అందుకే షూటింగ్‌లో సాధ్యమైనంత వరకు ఎవరూ లేని చోట చిత్రీకరణ చేయాలని కోరుతుంటానని తెలిపారు. యాక్షన్ సన్నివేశాల్లో వైర్లు కట్టి దూకించేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతుంటానని చెప్పారు.
‘‘హీరోలకు ఉండే అన్ని క్వాలిటీస్ నాకు లేవు. నాకు ఏం వచ్చో అది చేస్తుంటాను. నా బలాలు, బలహీనతలు ఏంటో నాకు బాగా తెలుసు’’ అని పవన్ తన గురించి సూటిగా చెప్పుకున్నారు.
‘జానీ’ నేర్పిన జీవిత పాఠం
పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జానీ’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత ఎదురైన అనుభవం తన ఆలోచనా విధానాన్నే మార్చిందని పవన్ చెప్పారు.
‘‘జానీ’ ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది నన్ను ఓ క్రిమినల్‌ను చూసినట్లుగా చూశారు. ఒక్క సినిమా ఫ్లాప్ కావడంతో మనుషుల ప్రవర్తన ఇంతలా మారిపోతుందా అనిపించింది. ఆ రోజు నుంచి హిట్, ఫ్లాప్‌లను ఒకేలా తీసుకోవడం నేర్చుకున్నాను’’ అని తెలిపారు.
‘గోపాల గోపాల’లో ఆహారం.. ఆవుపాలు, అరటిపండ్లే!
‘గోపాల గోపాల’ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్న సమయంలో తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానని పవన్ చెప్పారు. ఆ సమయంలో ఆవుపాలు, అరటిపండ్లు మాత్రమే ప్రధానంగా తీసుకునేవారట. ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి భక్తి గీతాలు ఎక్కువగా వినేవాడినని తెలిపారు. పురాణాలను వినడం ద్వారా దేవుడి గురించి తెలుసుకున్నానని.. తన దృష్టిలో దేవుడంటే మంచి విషయాలను చెప్పే వ్యక్తి అని వివరించారు.
పుస్తకాలు చెప్పిన బాటలో..
తాను చదివిన పుస్తకాల ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని పవన్ చెబుతుంటారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీ కొట్టాలని ప్రయత్నించిన సమయంలో మహాత్మా గాంధీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయని ఓ సందర్భంలో తెలిపారు.
‘‘ఒకసారి పరీక్షలో కాపీ చేస్తూ దొరికిపోయానని, అలా చేయడం తప్పని గాంధీజీ చెప్పారు. ఆయన గురించి చదివి ఏం నేర్చుకున్నాను అని ఆలోచించాను. వెంటనే ఆ పరీక్షను రాయకుండా బయటకు వచ్చేశాను’’ అని పవన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
పరశురాముడంటే ఎందుకంత ఇష్టం?
ఇతిహాసాల్లో తనకు పరశురాముడి పాత్ర అంటే ఎంతో ఇష్టమని పవన్ చెప్పారు. ‘నేను’ అనే అహంకారాన్ని జయించిన వ్యక్తిగా పరశురాముడిని చూస్తానని తెలిపారు.
రామాయణం, మహాభారతాలను కేవలం కథలుగా చూడనని.. వాటిలోని అంశాలను తన జీవితానికి అన్వయించుకుంటానని చెప్పారు. ‘‘ఒక ఘట్టంలో పైకి కనిపించే కథ ఒకటైతే.. దాని వెనుక దాగున్న భావం మరోలా ఉంటుంది. ఆ అంతరార్థాన్ని అన్వేషిస్తూ చదవడం నాకు ఇష్టం’’ అని వివరించారు.
జానపద గీతాలంటే ప్రత్యేక అభిమానం
చిన్నతనంలో తన తండ్రి ఇంట్లో జానపద గీతాలు వినేవారని.. అలా తనకూ వాటిపై ఆసక్తి ఏర్పడిందని పవన్ చెప్పారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడిందని, వారి పాటల బాణీలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.
అందుకే అవకాశం దొరికినప్పుడల్లా తన సినిమాల్లో జానపద గీతాలకు చోటు కల్పిస్తుంటానని చెప్పారు. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘జానీ’ తదితర చిత్రాల్లోని జానపద గీతాలు కూడా ఆ ఆసక్తితోనే సినిమాలో భాగమయ్యాయని పవన్ వెల్లడించారు.
సినిమాల్లో నటుడిగా.. వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రతో.. పవన్ కల్యాణ్ ప్రయాణం ప్రత్యేకమైనదే. అందుకే ఆయన అభిమానులకు పవన్ ఓ పేరు మాత్రమే కాదు.. ఓ భావోద్వేగం.
No comments:
Post a Comment