- ప్రపంచవ్యాప్తంగా సేవలు తాత్కాలికంగా నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలపై కఠిన చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త అపాయింట్‌మెంట్లతో పాటు ఇప్పటికే ఇంటర్వ్యూలు ఖరారైన కొందరు దరఖాస్తుదారుల షెడ్యూల్‌లను కూడా రద్దు చేసినట్లు రాయిటర్స్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఈ నెలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. వీసా దరఖాస్తులను మరింత సమగ్రంగా, ఒకే విధమైన ప్రమాణాలతో పరిశీలించేలా కాన్సులర్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ శిక్షణకు అనుగుణంగా వీసా సేవల అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు పొందిన దరఖాస్తుదారులకు వారి అపాయింట్‌మెంట్లు రద్దయ్యాయని, కొత్త తేదీ, సమయాన్ని తర్వాత తెలియజేస్తామని ఈమెయిళ్లు పంపినట్లు సమాచారం. అయితే వీసా ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయో, కొత్త అపాయింట్‌మెంట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అమెరికా విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు.
ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలను అడ్డుకునే చర్యల్లో భాగంగా వీసా, గ్రీన్‌కార్డ్ దరఖాస్తులపై కఠిన పరిశీలన, దేశ బహిష్కరణలు, శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు వంటి చర్యలను ఇప్పటికే చేపట్టింది. తాజాగా వీసా అపాయింట్‌మెంట్ల నిలిపివేతతో ముఖ్యంగా అమెరికా వెలుపలే ప్రక్రియ పూర్తి చేయాల్సిన వలసదారుల్లో మరింత అనిశ్చితి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 21న ఓ అమెరికా న్యాయమూర్తి 75 దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేసే ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని కొట్టివేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఉన్న చట్టబద్ధ అధికార పరిధిని ప్రభుత్వం మించిందని న్యాయస్థానం పేర్కొంది.
No comments:
Post a Comment