Thursday, 20 August 2026

'వందేమాతరం' విభజనే దేశ విభజనకు పునాది


  • కాంగ్రెస్‌పై మండిపడిన అమిత్ షా



చెంగల్పట్టు (తమిళనాడు): కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) 'వందేమాతరం' గేయంపై తీసుకున్న తీర్మానంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఒక "దేశవ్యతిరేక నిర్ణయం" అని అభివర్ణించారు. 1937లో తీసుకున్న తీర్మానాన్నే మళ్లీ అనుసరిస్తూ వందేమాతరంలోని కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. "1937లో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటు బ్యాంక్ తుష్టీకరణ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందేమాతరం గేయాన్ని రెండుగా విభజించింది. ఆ రోజు వేసిన విత్తనమే తర్వాతి కాలంలో దేశ విభజనకు పునాదిగా మారింది. ఆ చారిత్రక తప్పును ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దింది. జాతీయ ఐక్యతను చాటుతూ పూర్తి గేయాన్ని ఆలపించేలా చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించింది. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చేసిన చట్టాన్ని తోసిపుచ్చి, తన పాత తీర్మానాన్నే అమలు చేస్తాననడం వారి తుష్టీకరణ విధానానికి పరాకాష్ట" అని మండిపడ్డారు.


బంకిం చంద్ర ఛటోపాధ్యాయ సృష్టించిన  గేయాన్ని, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన లక్షలాది మంది త్యాగధనులను కాంగ్రెస్ ఈ నిర్ణయం ద్వారా అవమానించిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ ప్రతీకార, విభజన రాజకీయం చేస్తోందని విమర్శించారు. వందేమాతరాన్ని విభజించి గతంలో దేశం మూల్యం చెల్లించుకుందని, మళ్లీ అలాంటి పరిణామాలను దేశ ప్రజలు సహించరని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చిన అమిత్ షా, ఈ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...