- ముగ్గురు సిబ్బంది మృతి
సనా/దుబాయ్: ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యెమెన్‌కు చెందిన ఇరాన్ అనుకూల హూతీ తిరుగుబాటుదారులు బాబ్ ఎల్-మందెబ్ జలసంధిలో ఓ చిన్న కార్గో నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందినట్లు యెమెన్ కోస్ట్‌గార్డ్ వర్గాలు, ప్రభుత్వ సైనిక అధికారులు వెల్లడించారు.
టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న తిహామా అనే నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఒమన్‌లోని సలాలా నుంచి జిబౌటీ వైపు వెళ్తున్న ఈ నౌకలో ఇద్దరు పాకిస్థానీయులు, ఒక ఇండోనేషియా పౌరుడు ఉన్నారని యెమెన్ వర్గాలు తెలిపాయి. అయితే దాడిపై హూతీలు ఇప్పటివరకు అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు. నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరణ కోసం సముద్ర భద్రతా సంస్థలు వివరాలను పరిశీలిస్తున్నాయి.
ఈ దాడి నిజమైతే.. ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత హూతీల దాడిలో నౌక సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి కానుంది.
ఇప్పటికే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలపై హూతీల దాడుల ముప్పు కొనసాగుతోంది. మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబ్ ఎల్-మందెబ్ జలసంధిలో తాజా దాడి సముద్ర రవాణాపై మరింత అనిశ్చితిని పెంచింది.
హూతీలు గత నెలలో ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాపై నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించారు. సౌదీ తమపై దిగ్బంధనం విధించిందని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగారు. అయితే యెమెన్‌పై తాము ఎలాంటి దిగ్బంధనం విధించలేదని సౌదీ అరేబియా ఖండించింది.
బాబ్ ఎల్-మందెబ్ జలసంధి అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి కీలక మార్గంగా ఉంది. క్ప్లర్ డేటా ప్రకారం గత వారం రోజుకు సగటున 32 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించాయి. దిగ్బంధనానికి ముందు రోజుకు సగటున 50 నౌకలు ఈ జలసంధిని దాటేవి. తాజా దాడితో ఈ కీలక సముద్ర మార్గంలో నౌకల రాకపోకలపై ఆందోళనలు మరింత పెరిగాయి.
No comments:
Post a Comment