Wednesday, 5 August 2026

2013 లైంగిక దాడి కేసు: ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ దోషి

 



  •  బాంబే హైకోర్టు సంచలన తీర్పు


పనాజీ: తెహెల్కా పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కి బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. 2013లో జూనియర్ సహచర ఉద్యోగినిపై జరిపిన లైంగిక దాడి  కేసులో ఆయనను హైకోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. గతంలో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2021లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. విచారణ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పోండా హాజరయ్యారు.


కేసు నేపథ్యం

2013 నవంబరులో గోవాలో జరిగిన ‘థింక్‌ఫెస్ట్’ వేడుకల సమయంలో ఒక నక్షత్ర హోటల్ లిఫ్ట్‌లో తనపై తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆయన వద్ద పనిచేసిన జూనియర్ జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. 2017లో మాపుసా విచారణ కోర్టులో మొదలైన ఈ కేసు విచారణ అనంతరం 2021లో తేజ్‌పాల్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది.


బాధితురాలి ప్రవర్తనపై తుషార్ మెహతా వాదనలు

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఒక నిర్దిష్ట శైలిలోనే ప్రవర్తించాలనే ముందస్తు అంచనాలతో సెషన్స్ కోర్టు వ్యవహరించి తీవ్ర పొరపాటు చేసిందని తెలిపారు. ప్రతి వ్యక్తి విద్య, మానసిక పరిస్థితి, సామాజిక నేపథ్యం , పరిస్థితులను బట్టి స్పందనలు వేర్వేరుగా ఉంటాయని, బాధితుల ప్రవర్తనకు ఎటువంటి సార్వత్రిక నిబంధనలు ఉండవని కోర్టుకు విన్నవించారు.తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన వెంటనే ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని మెహతా డిమాండ్ చేశారు. "తన కుమార్తె వయసున్న మహిళపై ఆయన ఈ నేరానికి పాల్పడ్డారు. బాధితురాలు 'వద్దు' అని నిరాకరించినా ఆయన వినలేదు. ఒక మహిళ 'నో (వద్దు)' అని చెబితే దానర్థం 'నో' అనే బలమైన సందేశం ఈ తీర్పు ద్వారా సమాజానికి వెళ్లాలి" అని పేర్కొన్నారు.


ఉదారత చూపాలని తేజ్‌పాల్ విజ్ఞప్తి

కోర్టు నిర్ణయం అనంతరం తేజ్‌పాల్ స్పందిస్తూ.. "నా వయస్సు 62 ఏళ్లు. ఈ కేసులో నేనే బాధితుడిని. ఈ తీర్పుపై ఉన్నత కోర్టులో అప్పీలు చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. నా పట్ల కొంత ఉదారంగా వ్యవహరించాలి" అని న్యాయస్థానాన్ని వేడుకున్నారు.

No comments:

Post a Comment

Featured post

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానిక...