- బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేసేవరకు వారిని నిద్రపోనివ్వమని, దేశ ప్రజల ఆకాంక్షలు , గొంతుక ఇప్పుడు ఆపలేనిశక్తిగా మారాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యూఢిల్లీలో జరిగిన 'రచనాత్మక్ కాంగ్రెస్ జాతీయ సదస్సు'లో గురువారం ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, మోడీ -షాలు తమ వల్ల కాదని ఒప్పుకుని దిగిపోయే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటం హింస లేదా ద్వేషంతో కూడుకున్నది కాదని, దేశ సంస్కృతి, ప్రేమ , సోదరభావాన్ని కాపాడటానికేనని వ్యాఖ్యానించారు. మోడీ ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) తీవ్రమైన అంతర్గత తిరుగుబాటు జరుగుతోందని, ఆ సమాచారం నేరుగా తనకు అందుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత విదేశాంగ విధానాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పశ్చిమాసియా , ఇరాన్ సంక్షోభంలో భారత్, అమెరికా, రష్యాలతో ఉన్న మంచి సంబంధాలను ఉపయోగించి మధ్యవర్తిత్వం వహించే గొప్ప అవకాశాన్ని వదులుకుందని, దానివల్ల భారత్ స్థానంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా మారిందని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మన పెట్రోలింగ్ ప్రాంతాలను చైనా ఆక్రమించి అడ్డుకుంటున్నప్పటికీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోడీలు మీడియాపై ఒత్తిడి తెచ్చి ఆ వార్తలను నొక్కేస్తున్నారని ఆరోపించారు. గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చేసిన ప్రకటనలు చైనాతో చర్చలలో భారత సైన్యం బలాన్ని తగ్గించాయని మండిపడ్డారు. కేవలం అదానీ వంటి కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాలు, రాజకీయ నిధుల కోసమే దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు.
నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థుల గొంతు నొక్కడానికి ప్రభుత్వం యత్నించిందని, తమకు అనుకూలమైన ఆంక్షల వ్యవస్థను ప్రజలపై రుద్దడమే బీజేపీ రాజకీయ తత్వమని రాహుల్ ఆరోపించారు. దేశ ప్రజల స్వేచ్ఛా భావవ్యక్తీకరణను కాపాడటమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు నేటి ఆధునిక భారతదేశపు సంస్కృతి, చరిత్రపై కనీస అవగాహన లేదని, 3,000 ఏళ్ల నాటి పాత విషయాలను మాట్లాడేవారు వర్తమాన భారతాన్ని అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment