- సీఎం రేవంత్ పర్యటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేపట్టిన 9-10 రోజుల యూకే, యూఎస్ పర్యటనపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం పర్యటనలో మొదటి భేటీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని 'బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్' (Blavatnik School of Governance) లో జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా, అలాగే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయస్థాయిలో అసత్య ప్రచారాలు చేయడానికి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ధర్మపురి అరవింద్.. "2014 తర్వాత భారతదేశంలో యూపీఏ హయాంలో జరిగినట్లుగా ఎలాంటి పెద్ద వరుస బాంబు పేలుళ్లు జరగలేదన్న విషయం గమనించాలి. 2004 నుంచి 2014 మధ్య దేశంలో 27 వరుస బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 1,100 మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు" అని గుర్తుచేశారు. సదరు సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వ్యాసాలు అంతర్జాతీయ సమాజం స్వచ్ఛంద సంస్థలు (NGOలు), పౌర సమాజాల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాయని విమర్శించారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా, అయోధ్య ఉద్యమానికి మరియు దాని తర్వాతి అభివృద్ధికి వ్యతిరేకంగా కూడా ఆ సైట్‌లో రాసుకొచ్చారని తెలిపారు. భారతదేశంపై రోజూ విషం చిమ్మే సంస్థలను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.
No comments:
Post a Comment