- ఎర్రకోటపై చరిత్రాత్మక ఘట్టం
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’ తొలిసారిగా సంపూర్ణంగా ఆలపించబడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలోని ఎర్రకోటపై నిర్వహించిన అధికారిక వేడుకల్లో జాతీయ గీతం ‘జన గణ మన’కు ముందు జాతీయ గీతిక ‘వందే మాతరం’ను పూర్తిగా ఆలపించారు. అనంతరం సంప్రదాయంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’కు 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎర్రకోట బురుజులపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సమయంలో 1721 ఫీల్డ్ బ్యాటరీకి చెందిన దేశీయంగా తయారైన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 తుపాకుల వందనం సమర్పించారు. అనంతరం ఆర్మీ బ్యాండ్ ‘వందే మాతరం’ను ఆలపించింది. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేడుకల ప్రాంగణంపై పూలవర్షం కురిపించాయి. వాటిలో ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’ అని రాసిన పతాకాన్ని మోసుకెళ్లింది.
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఎర్రకోటపై ‘వందే మాతరం’ను తొలిసారిగా ఆలపించడం ఇదేనని పేర్కొన్నారు. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలాపనతో వేడుకల్లో ఈ చారిత్రక ఘట్టం పూర్తయింది. ఇటీవల ‘వందే మాతరం’ సంపూర్ణ రూపానికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ కల్పించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం పూర్వసంధ్యన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, అనంతరం కూడా సంపూర్ణ ‘వందే మాతరం’ను ఆలపించారు.
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ‘వందే మాతరం’కు జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. సవరించిన చట్టం ప్రకారం జాతీయ గీతిక ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా భంగం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ పోషించిన కీలక పాత్రను రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో గుర్తుచేశారు. స్వదేశీ ఉద్యమం సమయంలో ఈ గీతం ప్రజల గీతంగా మారిందని ఆమె పేర్కొన్నారు. బంకిమ్‌చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ‘ఆనందమఠం’ నవలలో తరువాత ‘వందే మాతరం’ భాగమైంది. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా దీనిని ఆలపించారు. 1905 ఆగస్టు 7న ‘వందే మాతరం’ తొలిసారిగా రాజకీయ నినాదంగా వినిపించినట్లు ప్రభుత్వ వివరాలు పేర్కొంటున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన ఈ గీతం.. 150 ఏళ్ల తర్వాత కూడా భారత జాతీయ భావనలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.
No comments:
Post a Comment