- ఈ-మెయిళ్లకు స్పందన లేదు: అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భారత్‌లో పరిమితం చేశారని ఆరోపిస్తూ మెటాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పలుమార్లు ఈ-మెయిల్‌లు పంపినా కారణం చెప్పకపోవడంతో పాటు స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన కేజ్రీవాల్, మెటాను ట్యాగ్ చేస్తూ తన ఖాతాను భారత్‌లో ఎందుకు అందుబాటులో లేకుండా చేశారని ప్రశ్నించారు. మెటా ఇండియా కార్యాలయంలో మౌఖికంగా విచారించగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై భారత్‌లో ఆంక్షలు విధించారని మాత్రమే చెప్పారని, కానీ అందుకు గల కారణాన్ని ఎవరూ వివరించలేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఆంక్షలను ఎలా తొలగించుకోవాలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను పంపిన ఈ-మెయిల్‌లకు సాధారణ స్వీకరణ సందేశాలు తప్ప మరే సమాధానం రాలేదని, ఇలాంటి సేవలు చాలా నిరాశ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఆరోపణలు వెలువడటం, ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ పోస్టుపై తాత్కాలికంగా విధించిన పరిమితుల విషయంలో మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన మరుసటి రోజే కావడం గమనార్హం.
బుధవారం మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కాప్లాన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ పోస్టుపై పొరపాటున పరిమితులు విధించబడినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రికి మెటా తరఫున క్షమాపణలు తెలిపినట్లు వెల్లడించారు. ఇక ప్రధాని మోడీ వీడియో తొలగింపు వ్యవహారంపై పార్లమెంటరీ ఐటీ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా తీవ్రంగా స్పందించారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే సంస్థకు ఉన్న చట్టపరమైన రక్షణను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ జూలై 28న ఫేస్‌బుక్‌లో యువతను ఉద్దేశించి పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చేసిన వీడియో సందేశం తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మెటా ప్రతినిధులను వివరణ కోరేందుకు పిలిపించింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఆ పోస్టు అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 5:30 గంటల వరకు అందుబాటులో లేదు. అయితే ఇది సాంకేతిక నిర్వహణలో జరిగిన పొరపాటు వల్లే జరిగిందని, అందుకే ప్రధాని మోడీ వీడియో ఐదు గంటల పాటు తొలగించబడిందని మెటా వివరణ ఇచ్చింది.
No comments:
Post a Comment