Wednesday, 19 August 2026

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు



  •  సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రాసిన 544 పేజీల ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నవంబర్‌లో విడుదల కానుంది. తన వ్యక్తిగత జీవితాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించడం అంత సులభంగా అనిపించలేదని సోనియా గాంధీ తెలిపారు. తనలోనే దాచుకున్న ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలను బయటపెట్టాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రముఖ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్‌ ఏ. నాఫ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సోనియా తన పుస్తక రచన అనుభవాలను పంచుకున్నారు. ‘‘వేదన, నష్టాలే నన్ను రాజకీయాల బహిరంగ ప్రపంచంలోకి నెట్టాయి. అప్పటివరకు నా వ్యక్తిగత జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాను’’ అని ఆమె చెప్పారు. తన జీవితాన్ని రాయడం తనకు సహజంగా అనిపించలేదని, తనలోనే దాచుకున్న అనుభవాలు, భావోద్వేగాలను పాఠకులతో పంచుకోవాల్సి వచ్చిందని వివరించారు.


ఇటలీ నుంచి భారత్‌ వరకు.. ప్రేమతో మొదలైన ప్రయాణం


‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో వెలువడనున్న ఈ పుస్తకం హార్డ్‌కవర్‌, ఈ-బుక్‌ రూపాల్లో నవంబర్‌ 10న విడుదల కానుంది. ఆడియో ఎడిషన్‌ను పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించనుంది. తొలివిడతగా లక్ష ప్రతులను ముద్రించనున్నట్లు ప్రచురణ సంస్థ తెలిపింది.

తన జీవితంలోని ఆనందాలు, చీకటి విషాదాల మధ్య సాగిన ప్రయాణానికి ఈ పుస్తకం ప్రతిబింబంగా నిలవాలని సోనియా ఆకాంక్షించారు. ‘‘నా జీవితంలో ఎన్నో విషయాలు రాశారు. అయితే నా కుటుంబ సభ్యుల నిర్ణయాలు, వారి చర్యలు, వారి మానవీయ బలహీనతల వెనుక ఉన్న నిజాలను చాలా కథనాలు పూర్తిగా ఆవిష్కరించలేకపోయాయి’’ అని ఆమె పేర్కొన్నారు. అందుకే ఈ పుస్తకం తన కుటుంబంలోని మానవీయ కోణానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. సోనియా గాంధీ బాల్యం నుంచి భారత్‌లో ఆమె జీవిత ప్రస్థానం వరకు పుస్తకంలో వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతర ఇటలీలోని చిన్న పట్టణంలో గడిచిన బాల్యం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టిన సందర్భాలు, రాజీవ్‌ గాంధీతో వివాహం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కోడలిగా మారిన దశలను ఆమె ఇందులో ప్రస్తావించారు.


1965లో రాజీవ్‌తో తొలి పరిచయం


ఈ పుస్తకం 1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ నుంచి ప్రారంభమవుతుంది. అప్పటికి 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్న సోనియా మైనో.. రాజీవ్‌ గాంధీని తొలిసారి కలుసుకుని ప్రేమలో పడిన సందర్భాలను వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఇందిరా గాంధీతో తన పరిచయం, భారతీయ సంస్కృతికి అలవాటు పడేందుకు చేసిన ప్రయత్నాలు, హిందీ నేర్చుకోవడం, చీర ధరించడం, భారతీయ వంటకాలను ఆస్వాదించడం వంటి వ్యక్తిగత అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే గాంధీ కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాదాలు ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాజీవ్‌ గాంధీ తమ్ముడు సంజయ్‌ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం, 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురికావడం, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఏడేళ్లకే ఎన్నికల ప్రచారంలో ఆయన కూడా హత్యకు గురికావడం వంటి విషాద ఘటనలు పుస్తకంలో కీలకంగా ఉండనున్నాయి.


రాజకీయాల్లోకి రావడం.. 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం


రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడిని చాలాకాలం పాటు సోనియా గాంధీ తిరస్కరించారు. అయితే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాల అనంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తూ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ప్రధాని పదవిని స్వీకరించేందుకు నిరాకరించిన నిర్ణయాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు.. ప్రేమ, కుటుంబం, విధేయత అనే అంశాలు తన ప్రయాణంలో నిరంతరం కొనసాగిన అంతర్లీన బంధంగా కనిపించాయని సోనియా పేర్కొన్నారు.


ఆరు దశాబ్దాల భారతీయ సామాజిక, రాజకీయ మార్పులకు తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని ఆమె చెప్పారు. భారత్‌ను తన ‘సొంత దేశం’గా అభివర్ణిస్తూ, ఈ దేశంలో తాను చూసిన పరిణామాలు, అనుభవాలను పాఠకులతో పంచుకోవడమే పుస్తకం ఉద్దేశమని తెలిపారు.

ప్రచురణ సంస్థ నాఫ్‌ ఈ పుస్తకాన్ని సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, భారత్‌తో ఆమె అనుబంధాన్ని ప్రతిబింబించే ఆత్మీయ కథనంగా పేర్కొంది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చోటుచేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు ప్రస్తుత రాజకీయ సవాళ్లపై ఆమె దృష్టికోణం కూడా ఇందులో కనిపిస్తుందని తెలిపింది.భారత్‌లో ఆరు దశాబ్దాలుగా జరిగిన ఆర్థిక, సామాజిక మార్పులపై అంతర్గత దృష్టితో పాటు.. గుర్తింపు, బాధ్యత, కుటుంబం, సొంత ఇల్లు అనే భావన వంటి అంశాలపై సోనియా గాంధీ ఆత్మపరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని ప్రచురణ సంస్థ వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు

 సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ...