Thursday, 20 August 2026

విపక్షాలను, దళితులను తొక్కేస్తున్న బీజేపీ



  • ‘హరా భరా స్వరాజ్’ సభలో ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ 


న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడూ తాను ఈ దేశంలో భాగమేనన్న భావనతో జీవించే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘హరా భరా స్వరాజ్‌: ఎ ట్రిబ్యూట్‌ టు రాజీవ్‌ గాంధీస్‌ విజన్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు సహా మైనారిటీ వర్గాలకు తమ ఉనికికి విలువ లేదన్న భావన కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘మీరు నోరు విప్పితే మీపై ఏం చేస్తామో చూస్తారు’’ అన్న భయాన్ని ఆ వర్గాల్లో కలిగిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోందని రాహుల్‌ అన్నారు. తమకు నచ్చినప్పుడు వారి భూములను తీసుకుంటామని, వాటి కోసం వారు పోరాడితే కాల్చివేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న దళితుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘కుల వ్యవస్థలో ఎలాంటి తప్పూ లేదని, అంతా సవ్యంగానే ఉందని చెబుతూ దళితుల ఆవేదనను పట్టించుకోవడం లేదు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇలాంటి పరిస్థితులే దేశంలో నెలకొన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మతం, సామాజిక వర్గం, వయసు, లింగభేదం వంటి ఏ అంశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ దేశంలో తనకంటూ ఒక స్థానం ఉందన్న భావన కలగాలని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ ‘నేను ఇక్కడివాడినే, ఈ దేశంలో నాకూ భాగస్వామ్యం ఉంది’ అని భావించే పరిస్థితి రావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...