- హెజ్‌బొల్లా పౌరులను మానవ కవచాలుగా వాడుతోంది: నెతన్యాహు
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ హెజ్‌బొల్లా తమ సైనికులపై దాడి చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఈ దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడటంతో.. దాడికి ఆదేశించిన హెజ్‌బొల్లా స్థావరాన్ని తమ సైన్యం లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని అన్‌సార్ ప్రాంతంలో హెజ్‌బొల్లాకు చెందిన రద్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో రద్వాన్ ఫోర్స్ బెటాలియన్ కమాండర్ అలీ సమీర్ అల్-హజ్ హసన్‌తో పాటు పలువురు మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హసన్ కుటుంబ సభ్యులు కూడా ఆ స్థావరంలో ఉన్నారని, దాడిలో వారు గాయపడ్డారని పేర్కొంది. అయితే వారిని లక్ష్యంగా చేసుకోలేదని, హసన్ చట్టబద్ధమైన సైనిక లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
హెజ్‌బొల్లా తమ సొంత పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. పౌరులను ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోందనే ఆరోపణలు చేయడానికే హెజ్‌బొల్లా వారిని ప్రమాదంలోకి నెడుతోందని అన్నారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. అయితే ఇజ్రాయెల్ వాదనలను హెజ్‌బొల్లా తీవ్రంగా ఖండించింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ “దూకుడు చర్యలకు పాల్పడుతోందని” ఆరోపించింది. అన్‌సార్ శివారులోని ఓ ఇల్లు, దెయిర్ అల్-జహ్రానీ ప్రాంతంలోని ఓ భవనంపై దాడులు జరిగాయని పేర్కొంది. ఈ దాడులు పౌరులనే లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించిన హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్ దాడులను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని లెబనాన్ ప్రభుత్వాన్ని కోరింది.
ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్, అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఖండించారు. అన్‌సార్‌పై జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు మరణించారని, వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని సలామ్ తెలిపారు. మృతులు ఎవరూ సైనిక లక్ష్యాలు కాదని, ఈ దాడులు దక్షిణ లెబనాన్‌లో పరిస్థితిని స్థిరీకరించే ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment