డార్క్ మ్యాటర్ నిగూఢాలను విప్పే దిశగా హబుల్ టెలిస్కోప్ అరుదైన ఆవిష్కరణ
అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ మరో కీలక ఆవిష్కరణకు వేదికైంది. మిల్కీవే గెలాక్సీకి వెలుపల తొలిసారిగా ఓ గ్లోబ్యులర్ క్లస్టర్‌కు చెందిన నక్షత్ర ప్రవాహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి సుమారు 11.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న యూజీసీ 9050-డీడబ్ల్యూ1 అనే గెలాక్సీలో ఈ అత్యంత మందమైన నక్షత్రాల జాడను హబుల్ టెలిస్కోప్‌కు సంబంధించిన పాత డేటాలో గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒక దట్టమైన నక్షత్ర సమూహంలోని నక్షత్రాలు క్రమంగా విడిపోయినప్పుడు.. మిగిలిన నక్షత్రాలు పొడవైన, సన్నని ప్రవాహంలా ఏర్పడతాయి. వీటినే ‘స్టెల్లార్ స్ట్రీమ్స్’గా పిలుస్తారు. మిల్కీవేలో ఇలాంటి అనేక నక్షత్ర ప్రవాహాలను ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అయితే ఇవి అత్యంత మసకగా ఉండటంతో చాలా ప్రవాహాలను గుర్తించడం కష్టమవుతోంది.
తాజాగా గుర్తించిన నక్షత్ర ప్రవాహాన్ని నమూనాగా రూపొందించడం ద్వారా శాస్త్రవేత్తలు యూజీసీ 9050-డీడబ్ల్యూ1 గెలాక్సీ నిర్మాణాన్ని, దాని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని అధ్యయనం చేశారు. గెలాక్సీ గురుత్వాకర్షణ ప్రభావమే నక్షత్ర ప్రవాహం ఆకారం, కదలికలను ప్రభావితం చేస్తుంది. ఈ ఆధారంగా గెలాక్సీలోని మొత్తం ద్రవ్యరాశిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇందులో నక్షత్రాల వంటి కనిపించే పదార్థంతో పాటు డార్క్ మ్యాటర్ కూడా ఉంటుంది. మిల్కీవే వెలుపల నక్షత్ర ప్రవాహాన్ని గుర్తించిన విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని పరిశోధన సహ-ప్రధాన రచయిత జూలీ కీల్ హోల్మ్ తెలిపారు. ఈ ఆవిష్కరణతో ఇతర గెలాక్సీల్లోని డార్క్ మ్యాటర్ స్వభావం, పరిమాణం, పంపిణీపై మరింత లోతైన అధ్యయనాలకు అవకాశం ఏర్పడిందని పరిశోధకులు భావిస్తున్నారు.
డార్క్ మ్యాటర్ ((అదృశ్య పదార్థం) ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యంగానే ఉంది. దాన్ని నేరుగా చూడటం సాధ్యం కాకపోయినా.. నక్షత్రాలు, గెలాక్సీలపై దాని గురుత్వాకర్షణ ప్రభావాలను గుర్తించవచ్చు. విశ్వంలోని మొత్తం పదార్థంలో సుమారు 80 నుంచి 85 శాతం వరకు డార్క్ మ్యాటర్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం విశ్వ పరిణామాన్ని తెలుసుకోవడంలో కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.ఇప్పటివరకు మిల్కీవేలోని డార్క్ మ్యాటర్‌ను అధ్యయనం చేసేందుకు నక్షత్ర ప్రవాహాలను ఉపయోగించారు. ఇప్పుడు మిల్కీవే వెలుపల గుర్తించిన ఈ ప్రవాహం ద్వారా ఇతర గెలాక్సీల్లో డార్క్ మ్యాటర్ ఎంత ఉంది, ఎలా విస్తరించి ఉంది అనే అంశాలను అధ్యయనం చేసే కొత్త మార్గం తెరుచుకుంది.
ఈ నక్షత్ర ప్రవాహం ‘అల్ట్రా-డిఫ్యూస్ గెలాక్సీ’గా పిలిచే ఒక ప్రత్యేకమైన గెలాక్సీలో కనిపించింది. ఇలాంటి గెలాక్సీలు చాలా తక్కువ ప్రకాశంతో, విస్తృతంగా వ్యాపించిన నిర్మాణంతో ఉంటాయి. ఈ లక్షణాల కారణంగానే నక్షత్ర ప్రవాహాన్ని గుర్తించడం కొంత సులభమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అల్ట్రా-డిఫ్యూస్ గెలాక్సీలు పరిమాణపరంగా భారీగా ఉండొచ్చని పరిశోధన సహ-ప్రధాన రచయిత సారా పియర్సన్ తెలిపారు. ఒక నక్షత్ర సమూహం నుంచి నక్షత్రాలను విడదీసి ప్రవాహంగా మార్చాలంటే సంబంధిత గెలాక్సీకి తగినంత గురుత్వాకర్షణ శక్తి, ద్రవ్యరాశి ఉండాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఈ ఆవిష్కరణ డార్క్ మ్యాటర్‌తో పాటు గెలాక్సీల పుట్టుక, పరిణామంపై శాస్త్రవేత్తల అవగాహనను మరింత విస్తరించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment